ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ నాయకుడు కాకపోయి వుంటే, మంచి క్రీడాకారుడు అయ్యి వుండేవారేమో. అది కూడా చెస్‌లాంటి మేధో క్రీడలో తప్పక రాణించేవాడని సరదా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టసవరణకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో కొందరు లబోదిబోమంటున్నారు.
గతంలో జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు ముందుకు రాగా, కొందరు న్యాయస్థానానికి వెళ్లి అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 54,307 మంది పేద కుటుంబాలకు రాజధాని ప్రాంతంలోని 1,251 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2020, ఫిబ్రవరి 25న జీవో నంబర్ 107 జారీ చేసింది.
తమ మధ్యకు పేదలొస్తే భూముల రేట్లు తగ్గుతాయని, ఇది సీఆర్‌డీఏ చట్టానికి విరుద్ధమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సీఆర్‌డీఏ చట్టానికి విరుద్ధమని హైకోర్టు సదరు జీవోను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆ చట్టానికే సవరణలు చేసి, ఎలాగైనా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం పట్టు పట్టింది. ఇందులో భాగంగా సీఆర్‌డీఏ చట్టానికి సవరణలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
2014లో తీసుకొచ్చిన సీఆర్‌డీఏ చట్టంలోని 41(1), 41(3) సెక్షన్లను తాజాగా జగన్ ప్రభుత్వం సవరించింది. అలాగే కొత్తగా 41(6) సెక్షన్‌ను చేర్చింది. 2(22) సెక్షన్‌ను సవరించడంతో పాటు కొత్తగా 53(1) సెక్షన్‌ను చేర్చింది. సవరించిన సెక్షన్ ప్రకారం అమరావతిలో ఏర్పాటుచేసే అఫర్డబుల్ హౌసెస్‌ను ఎక్కడి వారికైనా ఇవ్వొచ్చు.
సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు చోటే లేకుండా టీడీపీ ప్రభుత్వం చట్టం చేస్తే, దానికి ప్రస్తుత ప్రభుత్వం సవరణ చేయడం విశేషం. గతంలో తమకు అనుకూలంగా, పేదలకు వ్యతిరేకంగా చట్టాలు చేసుకుని, అవే తమకు రక్షణగా వుంటాయని వారు భావించారు. అయితే జగన్ మరోలా ఆలోచించారు. పేదలకు ప్రయోజనం కలిగించే కోణంలో టీడీపీ ఎత్తులను చిత్తు చేసేలా రాజకీయ క్రీడకు తెరలేపారు.
జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో అమరావతి రియల్టర్లకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. టీడీపీ, ఎల్లో బ్యాచ్‌తో జగన్ ఆటాడుతున్న తీరు గమనిస్తే… ఈయన రాజకీయ నాయకుడు కాకపోయి వుంటే, మంచి చెస్ ప్లేయర్ అయ్యేవారని నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.