మరోసారి పవన్‌కల్యాణ్, చంద్రబాబునాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధుల్ని బటన్ నొక్కి సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ ప్రత్యర్థులపై చెలరేగారు.
వైఎస్సార్ చేయూత అనే పథకం ద్వారా 58 నెలల్లో 33,14,916 మంది తన అక్కచెల్లెమ్మళ్లకు నేరుగా వారి ఖాతాల్లోకి రూ.19,189 కోట్ల జమ చేసినట్టు జగన్ తెలిపారు. గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా అని ప్రతి అక్కచెల్లెమ్మ వారి కుటుంబాలు, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో ప్రత్యర్థులపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను నమ్మడం అంటే, కాటేసే పాముని నమ్మడమే అని ఆయన అన్నారు. తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అని ఆయన ఘాటు విమర్శ చేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడి పేర్లు చెబితే మోసం, వంచన గుర్తుకొస్తాయన్నారు. వివాహ వ్యవస్థకు కళంకం తెచ్చిన వ్యక్తి దత్తపుత్రుడని ఆయన విమర్శించారు. కార్లను మార్చినట్టు భార్యల్ని దత్త పుత్రుడు మార్చాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
2014లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నమ్మబలికి మహిళలను చంద్రబాబు వంచించాడని విమర్శించారు. బాబు వస్తున్నాడు, రుణమాఫీ చేస్తాడని టీవీల్లో ప్రకటనలు ఇచ్చి మరీ మోసం చేశాడని జగన్ మండిపడ్డారు. ఉమెన్ ప్రొటెశ్రీన్ ఫోర్స్ సహా అన్ని వాగ్దానాలను చంద్రబాబు, దత్త పుత్రుడు అమలు చేశారా? అని జగన్ నిలదీశారు.