రాజ్యసభ సభ్యుడు, టీడీపీ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోవూరులో నెల్లూరు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమంలో నల్లపురెడ్డి మాట్లాడుతూ ఒకరి ద్వారా లబ్ధి, పదవులు పొందినప్పుడు నిజాయతీగా వుండాలన్నారు.
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నమ్మక ద్రోహి అని ఆయన విమర్శించారు. సీఎం వైఎస్ జగన్‌కు వేమిరెడ్డి ద్రోహం చేశారని ఆగ్రహించారు. వేమిరెడ్డిని ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్‌ను ముస్లిం మైనార్టీకి ఇచ్చాడనే కారణంతో వేమిరెడ్డి పార్టీని వీడారని విమర్శించారు. 50 ఏళ్ల చరిత్రలో నెల్లూరు సిటీ టికెట్‌ను ముస్లిం మైనార్టీకి ఇచ్చిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు.
ముస్లింలకు టికెట్ ఇచ్చారని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీని వీడారని, నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని మైనార్టీలంతా తమ సత్తా ఏంటో చూపాలని ఆయన పిలుపునిచ్చారు. వేమిరెడ్డికి డబ్బు ఉండొచ్చు, కోటీశ్వరుడు కావచ్చు.. కానీ ముస్లిం మైనార్టీ వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీ కావద్దని అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
వైసీపీలో అన్ని రకాల పదవులు కుటంబ సమేతంగా వేమిరెడ్డి దంపతులు అనుభవించారని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు విమర్శించారు. చివరి క్షణంలో ఇలాంటి ద్రోహం చేసిన వేమిరెడ్డిని ఎవరూ క్షమించకూడదన్నారు. దీన్ని సవాల్‌గా తీసుకుని విజయసాయిరెడ్డిని గెలిపించుకోవాలని బీద పిలుపునిచ్చారు.