టీడీపీ, జనసేన కూటమి మేనిఫెస్టోపై స్పష్టత వచ్చింది. చాలా రోజుల క్రితం మేనిఫెస్టో విడుదల చేస్తామని పవన్‌కల్యాణ్, నారా లోకేశ్ ప్రకటించారు. అయినప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించినప్పటికీ , ఎందుకనో వాటిపై పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. పవన్‌కల్యాణ్ కూడా పథకాలను ప్రకటించారు. అవేవో ఆయనే మరిచిపోయారు.
చంద్రబాబు, పవన్‌కల్యాన్ ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆవే తమకు ఓట్లు రాల్చుతాయని ఆ ఇద్దరు నాయకులు అనుకుంటున్నారు. మరో వైపు జగన్ మాత్రం ఐదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. అలాగే అభివృద్ధి పనులపై మాట్లాడుతున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్‌తో కలిసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. ఈ బహిరంగ సభ ద్వారా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
ఈ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే ఎండీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చిలకలూరిపేట సభ కొత్త చరిత్రను సృష్టిస్తుందన్నారు. పవన్‌కల్యాణ్ రాత్రికి ఢిల్లీ చేరుకుంటారని ఆయన చెప్పారు.