రాయలసీమ సమాజాన్ని జనసేనాని పవన్‌కల్యాణ్ అవమానించేలా మాట్లాడారు. రాయలసీమ అంటే రౌడీయిజానికి పెట్టింది పేరు అయ్యిందని పవన్‌కల్యాణ్ ఘాటు విమర్శ చేయడం గమనార్హం. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరిక సందర్భంగా పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తూ రాయలసీమపై అవాకులు చెవాకులు పేలారు.
తాను తీవ్రంగా ద్వేషించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయలసీమ వాసి కావడంతో ఆయన ఆ ప్రాంతం మీద విషం చిమ్మేలా మాట్లాడ్డం తీవ్ర విమర్శలకు దారి తీసింది. చంద్రబాబునాయుడు కూడా రాయలసీమ వాసి అయినప్పటికీ, ఎప్పుడూ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం ఆయన పని చేయలేదు. కేవలం తన రాజకీయ ఉనికి కోసం మాత్రం రాయలసీమలోని కుప్పాన్ని అంటిపెట్టుకుని చంద్రబాబు ఉన్నారు.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ తాము ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంత ప్రయోజనాల కోసం పని చేశారు, చేస్తున్నారు. రాయలసీమ అంటే రౌడీలు, ఖూనీ కోరలన్న ముద్ర వేసి, తద్వారా రాజకీయంగా దెబ్బ తీయాలనే పన్నాగాన్ని పవన్‌కల్యాణ్ అమలు చేసేందుకు శ్రమిస్తున్నారు. దశాబ్దాలుగా చంద్రబాబునాయుడు రాయలసీమ సంస్కృతిపై విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. కానీ జనాలు పట్టించుకోలేదు.
ఇప్పుడు పవన్‌కల్యాణ్ ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు. అందుకే రాయలసీమ సమాజాన్ని రౌడీరాజ్యంగా ఆయన విమర్శించగలిగారు. రాయలసీమలో వైసీపీ బలంగా వుండడంతో పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకొక సారి వైసీపీని అధికారంలోకి తెచ్చకుంటే ఇక రాయలసీమను మరిచిపోవచ్చన్నారు. అందరూ గల్ఫ్, తెలంగాణ ప్రాంతాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్లిపోవాలని ఆయన వెటకారంగా అన్నారు.
తెలంగాణ వాళ్లతో మళ్లీ తిట్టించుకోండన్నారు. జగన్ గుంపు నుంచి రాయలసీమను కాపాడుకోలేకపోతే మనుషులెవరూ వుండరని ఆయన హెచ్చరించారు. సీమ అంటే రౌడీలనే ముద్ర వేయడానికి జగన్‌ను సాకుగా తీసుకున్నారు. రాజకీయంగా ఆ ప్రాంతం ఆదరించలేదనే కోపం ఆయన మాటల్లో కనిపించింది.