ఏ ఎన్నికలు అయినా ఆంధ్ర భీమవరం బ్యాచ్ బెట్టింగ్ ట్రెండ్ అనేది ఒకటి వుంటుంది. ఎవరు ఎలా చెప్పినా, ఆ బెట్టింగ్ బ్యాచ్ అంచనాలు కాస్త వాస్తవంగానే వుంటాయి. షేర్ మార్కెట్ మాదిరిగా రోజూ బెట్టింగ్ నెంబర్లు మారుతుంటాయి.
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల విషయంలో చాలా అసెస్ చేసి, అంచనాలు వేసి బెట్టింగ్ లు కాస్తుంటారు. కేవలం ఆవేశంగా కాసే పందాలు తక్కువ. ఈ పార్టీ మీద కాస్తే ఈ లెక్కన ఇస్తాం.. ఆ పార్టీ మీద కాస్తే ఆ లెక్కన ఇస్తాం అంటారు. అక్కడే తెలిసిపోతుంది విజయావకాశాలు ఎలా వున్నాయి అన్నది.
ప్రస్తుతం భీమవరం బెట్టింగ్ ల్లో వైకాపాకు 100 సీట్లు రేంజ్ లో నడుస్తోంది. అంటే వైకాపాకు వంద సీట్లు వస్తాయన్నది భీమవరం బెట్టింగ్ బ్యాచ్ అంచనా అన్నమాట. ఈ మేరకు ఎవరైనా కాదు.. లేదా అవును అనే విధంగా పందాలు కాసుకుంటారు. దాని లెక్కలు వేరే వుంటాయి. ఇక్కడ పందాల గురించి వివరించడం, వాటిని ప్రోత్సహించడం కాదు విషయం.
ఎల్లో మీడియా పత్రికలు, సోషల్ మీడియా హ్యాండిల్స్, వెబ్ సైట్లు చూస్తుంటే ఇక ఏం మిగలలేదు వైకాపా కు పట్టుమని పది సీట్లు కూడా రావు అనే భావన కలిగేలా వుంటాయి. ఇలాంటి గోబెల్స్ ప్రచారం సాగుతుంటే, ఇంకా వైకాపాకు 100 సీట్ల వరకు వస్తాయని బెట్టింగ్ లు, అది కూడా వైకాపా వీరాభిమానుల నుంచి కాకుండా భీమవరం బెట్టింగ్ బ్యాచ్ నుంచి రావడం కాస్త ఆశ్చర్యమే కదా. ఇది నిజమైన గ్రౌండ్ రిపోర్ట్ ను చెబుతోంది.
జగన్ ఓడిపోతున్నాడు అని తమ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఊదర కొట్టగా కొట్టగా ఇప్పుడు పరిస్థితి ఇది. ఇంకా ఊదరగొడుతుంది ఎల్లో మీడియా. కానీ అసలు విషయం ముందు వుంది. అభ్యర్ధుల ప్రకటన. అది వచ్చిన తరువాత జనసేన, తేదేపాల్లో అసంతృప్తి సంగతి తేలుతుంది. అప్పుడు అసలు నెంబర్లు బయటకు వస్తాయి.
షేర్ మార్కెట్ మాదిరిగా భీమవరం బెట్టింగ్ ట్రెండ్ ను ఫాలో అయితే అసలు సిసలు రాజకీయం తెలుస్తూ వుంటుంది. ఎల్లో మీడియా ను ఫాలో అయితే అసత్యాలు, అర్థసత్యాలు తప్ప వేరు వుండవు.