ఓ మంచి హిట్ వచ్చిందంటే రేటు పెంచడానికి హీరోహీరోయిన్లు ఏమాత్రం మొహమాటపడరు. ఆ మాటకొస్తే డిజిటల్ రైట్స్ చూపించి పారితోషికం పెంచిన హీరోలు కూడా ఉన్నారు. అలాంటప్పుడు థియేట్రికల్ సక్సెస్ కొడుతున్న సుహాస్, రెమ్యూనరేషన్ పెంచకుండా ఉంటాడా?
ఇదే ప్రశ్న సుహాస్ కు ఎదురైంది. దీనికి అతడిచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగా ఉంది. రేటు పెంచితే తప్పేంటనేది సుహాస్ మాట.
“నేను బతకొద్దా.. జూనియర్ ఆర్టిస్టు స్థాయి నుంచి వచ్చాను. రోజుకు వంద రూపాయలకు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. హిట్ వచ్చినప్పుడు నేను కూడా తీసుకోవాలనుకుంటాను కదా. బయట అంతా నా పారితోషికాన్ని 3 వేల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు అని చెప్పుకుంటున్నారు. వెయ్యి రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు అని చెప్పుకోవచ్చు.”
ఇలా తన రెమ్యూనరేషన్ పై స్పందించాడు సుహాస్. అందరూ అంటున్నారు కాబట్టి తను కూడా 3 కోట్లు అనే నంబర్ ను వాడానని, నిజానికి అసలు నంబర్ అది కాదని కూడా చెప్పకొచ్చాడు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తర్వాత ప్రసన్నవదనం అనే సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు ఈ హీరో. ఈ సినిమాలో తను తొలిసారిగా స్టయిలిష్ గా కనిపిస్తానని, తొలిసారి హీరోయిన్ ను లిప్ కిస్ కూడా పెట్టానని చెప్పుకొచ్చాడు.
టీజర్ లాంఛ్ లో భాగంగా సుహాస్ ఈ వివరాలు బయటపెట్టాడు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత మణికంఠ, తన హీరో రెమ్యూనరేష్ దాదాపు 3 కోట్ల రూపాయలు ఉంటుందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడిస్తూనే.. అతడు 30 కోట్ల రేంజ్ హీరోగా ఎదిగినప్పటికీ, తను అతడి పక్కన ఉంటానని చెప్పుకొచ్చాడు.