ఈగో లేని జగన్ వైఖరి.. పార్టీకి మేలు!

అనుమానం ఉన్న చోట నారాయణా అన్నా కూడా బూతులాగా వినిపిస్తుంది. నమ్మకం ఉన్నచోట బూతు మాట్లాడినా సరే నారాయణా అన్నట్టుగా ధ్వనిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు పచ్చ మీడియా విషయంలో ఇప్పుడు అదే…

అనుమానం ఉన్న చోట నారాయణా అన్నా కూడా బూతులాగా వినిపిస్తుంది. నమ్మకం ఉన్నచోట బూతు మాట్లాడినా సరే నారాయణా అన్నట్టుగా ధ్వనిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు పచ్చ మీడియా విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.

ఆయన ఎలాంటి పని చేసినా సరే.. అందులో తప్పులు వెతకడం నిందలు వేయడం మీదనే పచ్చ  మీడియా దృష్టి పెడుతోంది. ఆయనలోని పాజిటివ్ ఆటిట్యూడ్ ను, సర్దుకుపోయే ధోరణిని కళ్లజూడలేకపోతోంది. దాన్ని కూడా భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తోంది.

ఎందుకంటే.. పార్టీలో టికెట్ల కేటాయింపులో జరుగుతున్న మార్పు చేర్పులపై అసంతృప్తి గురవుతున్న వారిని బుజ్జగించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను పచ్చమీడియా అడ్డగోలుగా వక్రదృష్టితో చూస్తోంది.

అసెంబ్లీలో అసంతృప్త ఎమ్మెల్యేలు కొందరితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు ఈసారి టికెట్ ఇవ్వలేదనే అలకతో జగన్ మీద విమర్శలు చేసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని, చీఫ్ విప్ ప్రసాదరాజు సీఎం వద్దకు తీసుకెళ్లారు. ‘ఏమన్నా కాపన్నా కోపమా.. ఎందుకన్నా.. నా చాంబర్ కు రా అన్నా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం’ అంటూ ముఖ్యమంత్రి ఆయనను పలకరించారు. అలాగే గుమ్మనూరు జయరాం, మల్లాది విష్ణులను కూడా ముఖ్యమంత్రి పలకరించారు. మల్లాది విష్ణు భుజం మీద చేయి వేసుకుని మాట్లాడుతూ తన చాంబర్ కు తీసుకువెళ్లారు.

అన్నిటినీ మించి, ‘కొన్ని పరిస్థితుల వల్ల టికెట్ల కేటాయింపులో అలా ఇవ్వవలసి ముఖ్యమంత్రి.. పార్టీలో వారి విలువను అన్యాపదేశంగా తెలియజెబుతూ అనునయంగా మాట్లాడారు.

సాధారణంగా పార్టీలో టికెట్ల కేటాయింపు సమయంలో నాయకులకు అసంతృప్తి ఏర్పడితే.. వారిని బుజ్జగించడానికి కీలక స్థానాల్లో ఉన్నవారు ప్రయత్నించడం సహజం. అదే పని జగన్ కూడా చేశారు. అయితే జగన్ వ్యవహార సరళి గురించి రకరకాల దుష్ప్రచారం సాగిస్తుండేవారికి.. జగన్ ఇలాంటి మితవాద వైఖరితో మాట్లాడడం మింగుడుపడుతున్నట్టు లేదు. పార్టీని కాపాడుకోడానికి జగన్ చేస్తున్న ఈ బుజ్జగింపు ప్రయత్నాలను కూడా, రాజ్యసభ ఎన్నికలకోసమే ఇలా చేస్తున్నట్టు వక్రంగా ప్రచారం చేస్తున్నారు.

కానీ, జగన్ ఇలా తగ్గి మాట్లాడడం.. అనునయ ధోరణితో ఆప్యాయంగా అసంతృప్తులను బుజ్జగించడం అనేది ఖచ్చితంగా పార్టీకి మంచి చేసే పరిణామమని పలువురు కార్యకర్తలు ఆనందిస్తున్నారు.