ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ మసిపూసి మారేడు కాయ చేయడం.. ఆయన నిర్ణయాల పట్ల కొన్ని కులాల్లో, కొన్ని వర్గాల్లో అసంతృప్తి రేకెత్తేలా చేసి తద్వారా అనుచిత లబ్ధి పొందడానికి ప్రయత్నించడం అనే దుర్మార్గాన్ని పచ్చ మీడియా యథేచ్ఛగా కంటిన్యూ చేస్తూనే ఉంది.
రాజ్యసభ ఎన్నికల విషయంలో ఎవరెవరిని ఆ సీట్లకు పంపాలనేది పార్టీ అధినేత ఇష్టం. పార్టీకోసం ఉపయోగపడే వారిని, ఎన్నికల్లో సీట్ల పరంగా ప్రాధాన్యం దక్కకపోతున్న వారిని ఎంచుకుని రాజ్యసభకు పంపుతుంటారు. అయితే దీనిమీద కూడా పచ్చ ప్రచారం యింకో రకంగా సాగుతోంది.
జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావులను ప్రకటించారు. నిజానికి ముందుగా లీక్ అయిన జాబితాలో చిత్తూరు ఎమ్మెల్యేగా మళ్లీ పోటీచేసే అవకాశం దక్కించుకోలేకపోయిన ఎమ్మెల్యే శ్రీనివాసులు పేరు ఉంది. ఆయన స్థానంలో ఇప్పుడు కొత్తగా మేడా రఘునాధరెడ్డి పేరు చోటుచేసుకుంది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి ఇప్పుడు మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో, అక్కడ ఆకేపాటి అమరనాధరెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. ఆయనకు ఊరడింపుగా అన్న మేడా రఘునాధరెడ్డిని రాజ్యసభకు పంపుతున్నారు.
అయితే కాపు వర్గానికి చెందిన శ్రీనివాసులుకు టికెట్ నిరాకరించి.. రెడ్డి వర్గానికి కట్టబెట్టారని, జగన్ ముఖ్యమంత్రి అయిన తొలినాటినుంచి అదే కులానికి ప్రాధాన్యం దక్కుతోందని మిగిలిన కులాలకు అన్యాయం చేస్తున్నారని పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. జగన్ నిర్ణయాలు కేవలం స్థానికంగా ఉన్న సమీకరణలు, అక్కడి బలాబలాలు సర్వే నివేదికల ఆధారంగా మాత్రమే జరుగుతున్నాయి. అయితే పచ్చ మీడియా ఓర్వలేకపోతోంది.
రెడ్లను తొలగించి, ఆ స్థానాలను బీసీలకు కట్టబెట్టే సందర్భాలలో మౌనం పాటిస్తున్న పచ్చ మీడియా.. రెడ్డి వర్గానికి టికెట్ ఇవ్వగానే.. నానా నిందలు వేయడానికి తెగిస్తోంది. ఉదాహరణకు తమ కుటుంబానికి ఎంతో ఆత్మీయుడు అయినప్పటికీ కూడా.. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పక్కకు తప్పించి అక్కడ గంజి చిరంజీవికి జగన్ టికెట్ కేటాయించారు. రెడ్డి వర్గం చేతిలో ఉన్న సీటును బీసీలకు ఇచ్చారని పచ్చమీడియాలో ఏ ఒక్కరూ రాయలేదు.
ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల విషయంలో మాత్రం.. వైసీపీ ఎంపీల్లో రెడ్డి వర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి రూపంలో ఒక సీటు ఖాళీ అవుతోంటే.. కొత్తగా ఇద్దరికి అదే వర్గం నుంచి స్థానం కల్పిస్తున్నారని పచ్చమీడియా ఆవేదన చెందుతోంది. ఖాళీ అవుతున్న సీట్లలో తెలుగుదేశానికి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, భాజపా ఎంపీ సీఎం రమేష్ కూడా ఉన్నారు.
సామాజిక న్యాయం అంటే.. ఏ కులాల సీట్లు ఖాళీ అయితే అదే కులాలకు జగన్ కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తారేమో అని ఈ కారుకూతలు చూస్తున్న జనం నవ్వుకుంటున్నారు.