ఒక వైపు ఎన్నికలకు షెడ్యూల్ త్వరలో వెలువడుతుందన్న వార్తలు. మరోవైపు అధికార పార్టీ అభ్యర్థుల ప్రకటన. ఏ రకంగా చూసినా ఎన్నికలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాయత్తం కావడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాను సిద్ధమవుతూ, మరోవైపు వైసీపీ శ్రేణుల్ని కూడా జగన్ సంసిద్ధం చేస్తున్నారు. దీంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వంపై సహజంగా కొంత వ్యతిరేకత ఉన్న మాట నిజం. అయితే ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్రస్థాయిలో జగన్ సర్కార్‌పై జనంలో వ్యతిరేకత లేదు. సర్వే నివేదికల ఆధారంగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలను పక్కన పెట్టడానికి జగన్ ఏ మాత్రం వెనుకాడడం లేదు. మంగళగిరిలో సిటింగ్ ఎమ్మెల్యే, తన కుటుంబానికి ఆప్తుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డిని సైతం జగన్ పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.
విజయవాడ సెంట్రల్‌లో మల్లాది విష్ణుకు సీటు లేదని తెగేసి చెప్పారు. అలాగే మాజీ మంత్రి అనిల్‌కు నెల్లూరు సిటీ కాదని నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అక్కడి సిటింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు సీటు ఆఫర్ చేయగా, దాన్ని ఆయన తిరస్కరించి పార్టీని వీడారు. ఇలా ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే వైసీపీలో పెద్దగా వ్యతిరేకత లేదు.
ఇక టీడీపీ విషయానికి వస్తే టికెట్ ఆశావహుల్లో టెన్షన్ నెలకుంది. జనసేనతో పొత్తు వల్ల తమ సీటుకు ఎక్కడ ఎసరు పెడతారో అని టీడీపీ నాయకులు భయపడుతున్నారు. ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు వుంటుందనడంతో ఏమవుతుందోనని టీడీపీ నేతలు భయాందోళనలో ఉన్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే, జనసేనతో కలిసి ఆ రెండు పార్టీలకు 50 సీట్లు ఇవ్వాల్సి వుంటుందనే చర్చ జరుగుతోంది.
ఇదే జరిగితే టీడీపీ నాయకత్వానికి భారీగా గండి పడుతుందనే మాట వినిపిస్తోంది. ఇక టీడీపీ పోటీ చేసే స్థానాలు 125 అని, ఇంత అధ్వాన స్థాయికి టీడీపీ గతంలో ఎప్పుడూ దిగజారలేదనే ఆవేదన ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఇదే ఆచరణకొస్తే, టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశమే వుండదని అంటున్నారు. గెలుపోటములను పక్కన పెడితే, చాలా నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని బలి పెట్టాల్సి వస్తుందని చంద్రబాబు ఎందుకు ఆలోచించలేకపోతున్నారనే ప్రశ్న ఎదురవుతోంది.
పోనీ నాయకత్వం నష్టపోయినా, టీడీపీకి రాజకీయంగా లాభం కలుగుతుందనే నమ్మకం కూడా లేదు కదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో పొత్తు పేరుతో జనసేన, బీజేపీలను ఎందుకు బలోపేతం చేసి, వాటి భస్మాసుర హస్తాలను తన నెత్తిన బాబు పెట్టుకోవాలని అనుకుంటున్నారని టీడీపీలో అంతర్మథనం మొదలైంది.
టీడీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను చంద్రబాబు స్వీకరించే పరిస్థితిలో లేరు. తన వ్యక్తిగత సమస్యల నుంచి అధిగమించేందుకే పార్టీని బలి పెట్టేందుకు చంద్రబాబు రెడీ అయ్యారనే విమర్శ కూడా పార్టీలో లేకపోలేదు. ఏది ఏమైనా బీజేపీ, జనసేనలతో పొత్తు టీడీపీ పాలిట భస్మాసుర హస్తమే అని ఆ పార్టీ నాయుకులు వాపోతున్నారు. అయితే వారి ఆవేదన అరణ్య రోదన కావడమే విషాదం.