మాకు మాత్రం ఒక టికెట్‌.. బాబు కుటుంబంలో న‌లుగురికా?

టీడీపీలో టికెట్ల గోల మొద‌లైంది. దివంగ‌త నేత ఎర్రంనాయుడు కుటుంబాన్ని మిన‌హాయిస్తే, మిగిలిన కుటుంబాల్లో ఒక‌రికి మాత్ర‌మే టికెట్ ఇస్తామ‌ని చంద్ర‌బాబు, లోకేశ్ తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో రెండు టికెట్లు ఆశిస్తున్న కొంద‌రు…

టీడీపీలో టికెట్ల గోల మొద‌లైంది. దివంగ‌త నేత ఎర్రంనాయుడు కుటుంబాన్ని మిన‌హాయిస్తే, మిగిలిన కుటుంబాల్లో ఒక‌రికి మాత్ర‌మే టికెట్ ఇస్తామ‌ని చంద్ర‌బాబు, లోకేశ్ తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో రెండు టికెట్లు ఆశిస్తున్న కొంద‌రు టీడీపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాబు కుటుంబ స‌భ్యుల‌కు మాత్రం నాలుగు టికెట్లు ఎలా ఇచ్చుకుంటార‌నే నిల‌దీత నాయ‌కుల నుంచి ఎదుర‌వుతోంది.

ప‌రిటాల‌, జేసీ, కేఈ, కోట్ల , చింత‌కాయ‌ల, పూస‌పాటి త‌దిత‌ర కుటుంబాలు రెండేసి టికెట్ల‌ను అడుగుతున్న‌ట్టు స‌మాచారం. జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్‌కు అనంత‌పురం ఎంపీ టికెట్ అడుగుతున్నారు. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు అస్మిత్‌రెడ్డికి తాడిప‌త్రి టికెట్‌తో టీడీపీ స‌రిపెడుతోంది. ప‌రిటాల కుటుంబంలో మాజీ మంత్రి సునీత‌, ఆమె త‌న‌యుడు శ్రీ‌రామ్‌కు రాప్తాడు, ధ‌ర్మ‌వ‌రం టికెట్లు అడుగుతున్నారు. కానీ రాప్తాడు టికెట్ మాత్ర‌మే ఇస్తామ‌ని, ఎవ‌రు నిల‌బ‌డాలో మీరే తేల్చుకోండ‌ని త‌ల్లీత‌న‌యుడికి చంద్ర‌బాబు తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది.

మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు త‌న‌కు న‌ర్సీప‌ట్నం అసెంబ్లీ, కుమారుడు విజ‌య్‌కి అన‌కాప‌ల్లి ఎంపీ సీటు కావాల‌ని అడుగుతున్నారు. అయితే విజ‌య్‌పై చంద్ర‌బాబు, లోకేశ్ సానుకూలంగా లేరు. అందుకే అయ్య‌న్న‌కు మాత్ర‌మే టికెట్ ఇవ్వ‌డానికి టీడీపీ మొగ్గు చూపుతోంది. త‌న రాజ‌కీయ వారసుడిగా  విజ‌య్‌ని తీసుకురావాల‌నే అయ్య‌న్న‌పాత్రుడి ఆశ నెర‌వేరే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

అలాగే కేఈ కృష్ణ‌మూర్తి కుటుంబంలో ఆయ‌న కుమారుడు శ్యామ్‌కు మాత్ర‌మే టికెట్ ఇస్తామ‌ని టీడీపీ అధిష్టానం తెగేసి చెప్పింది. కేఈ ప్ర‌భాక‌ర్‌కు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. అలాగే కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి క‌ర్నూలు ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఆయ‌న భార్య సుజాత‌మ్మ కూడా డోన్ టికెట్ అడుగుతున్నారు. డోన్ సీటుతో స‌రిపెట్టుకోవాల‌ని కోట్ల కుటుంబానికి చెప్పిన‌ట్టు తెలిసింది. ఇలా టీడీపీలో రెండేసి టికెట్ అడుగుతున్న ప్ర‌తి ఒక్క‌ర్నీ అధిష్టానం క‌ట్ట‌డి చేసింది.

అయితే ఇదే సూత్రం చంద్ర‌బాబు కుటుంబానికి వ‌ర్తించ‌దా? అని నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. చంద్ర‌బాబుకు కుప్పం, లోకేశ్‌కు మంగ‌ళ‌గిరి, నంద‌మూరి బాల‌కృష్ణ‌కు హిందూపురం, ఆయ‌న చిన్న‌ల్లుడు భ‌ర‌త్‌కు విశాఖ ఎంపీ లేదా ఏదైనా ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌డానికి మాత్రం ఇబ్బంది లేక‌పోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని రూల్ పెట్టుకున్న‌ప్పుడు, దాన్ని అంద‌రూ ఆచ‌రించిన‌ప్పుడే విలువ వుంటుంద‌ని హిత‌వు చెబుతున్నారు. ఎర్రంనాయుడు కుటుంబానికైతే ఒక నీతి, ఇత‌రుల‌కైతే మ‌రొక‌టా? అని ఆగ్ర‌హంతో నిల‌దీస్తున్న ప‌రిస్థితి టీడీపీలో నెల‌కుంది.