చేజేతులా నాశ‌నం చేసుకుంటున్న బాబు!

చంద్ర‌బాబునాయుడి నిర్ణ‌యాలు టీడీపీ శ్రేణుల్ని నిరాశ‌లోకి నెట్టేస్తున్నాయా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. జ‌న‌సేన‌తో పొత్తు ఎంతోకొంత త‌మ‌కు లాభ‌దాయ‌క‌మే అని టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మొద‌ట అనుకున్నారు. కానీ రోజులు గ‌డిచే కొద్ది…

చంద్ర‌బాబునాయుడి నిర్ణ‌యాలు టీడీపీ శ్రేణుల్ని నిరాశ‌లోకి నెట్టేస్తున్నాయా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. జ‌న‌సేన‌తో పొత్తు ఎంతోకొంత త‌మ‌కు లాభ‌దాయ‌క‌మే అని టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మొద‌ట అనుకున్నారు. కానీ రోజులు గ‌డిచే కొద్ది జ‌న‌సేన‌కే ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లుగుతోంద‌ని టీడీపీ శ్రేణులు అసంతృప్తికి గురి అవుతున్నాయి. త‌మతో పొత్తు అడ్డుపెట్టుకుని ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన‌ను బ‌లోపేతం చేసుకుంటున్నార‌ని టీడీపీ నేత‌లు గుర్రుగా ఉన్నారు.

నిజానికి టీడీపీతో పొత్తు లేక‌పోతే జ‌న‌సేన ఈ పాటికి దుకాణం బంద్ చేసేది. ఇదే సంద‌ర్భంలో తాము అండ‌గా నిల‌బ‌డ‌క‌పోయి వుంటే.. టీడీపీ ఔట్ అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల ప‌లు వేదిక‌ల‌పై నుంచి బ‌హిరంగంగానే అన్నారు. నెల క్రితం వ‌ర‌కు జ‌న‌సేన లేక‌పోతే టీడీపీకి అధికారం క‌లే అనే చర్చ జ‌రిగింది. జ‌గ‌న్‌ను ఒంట‌రిగా ఎదుర్కోనే ప‌రిస్థితిలో ఇటు చంద్ర‌బాబు, అటు ప‌వ‌న్‌క‌ల్యాణ్ లేర‌ని ఇరుపార్టీల నేత‌లు అంగీక‌రించే వాస్త‌వం.

ప్ర‌స్తుతానికి వ‌స్తే …జ‌న‌సేన‌తో పొత్తు ఉన్న‌ప్ప‌టికీ, వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డం అంత ఈజీ కాద‌ని చంద్ర‌బాబు చ‌ర్య‌లే చెబుతున్నాయి. ఏపీలో బీజేపీకి ప్ర‌జాద‌ర‌ణ లేక‌పోగా, వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ, వ్య‌వ‌స్థ‌ల సాయం కోసం ఆ పార్టీతో పొత్తు కోసం చంద్ర‌బాబు దిగ‌జారార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇంత‌కాలం టీడీపీ, జ‌న‌సేన పొత్తు కుదుర్చుకోవ‌డం వ‌ల్ల‌, ఇంకేముంది జ‌గ‌న్ ప‌ని అయిపోయింద‌ని ఎల్లో మీడియా ఊద‌ర‌గొట్టింది.

అస‌లు విష‌యానికి వ‌స్తే మాత్రం… బీజేపీ తోడైతే త‌ప్ప జ‌గ‌న్‌ను ఢీకొట్టే స‌త్తా లేద‌ని సంకేతాలు చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌, అనంత‌ర ప‌రిణామాలు సొంత పార్టీ శ్రేణుల‌కు సంకేతాలు ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం క్ర‌మంగా మారుతోంది. మ‌ళ్లీ జ‌గ‌న్ వైపు సానుకూల ప‌వ‌నాలు వీస్తున్న అభిప్రాయాన్ని బ‌లోపేతం చేస్తున్నాయి. చంద్ర‌బాబు పిరికిత‌న‌మే జ‌గ‌న్‌కు క‌లిసొస్తోంద‌ని టీడీపీ నేత‌లు సైతం చెబుతున్న మాట‌.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డేందుకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా, ఇంత వ‌ర‌కూ టీడీపీ,జ‌న‌సేన మ‌ధ్య సీట్ల పంచాయితీ తెగ‌లేదు. మ‌ధ్య‌లో బీజేపీతో పొత్తు గేమ్ మొద‌లైంది. ఈ మూడు పార్టీల మ‌ధ్య పొత్తు ఆట‌కు ముగింపు ఎక్క‌డో అర్థం కాని  ప‌రిస్థితి. మ‌రోవైపు బీజేపీ అండ లేక‌పోతే మ‌న‌మేం చేయ‌లేమ‌నే సంకేతాల్ని చంద్ర‌బాబు త‌న పార్టీ శ్రేణుల‌కి ఇవ్వ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం.

చంద్ర‌బాబు జైలుకెళ్ల‌డం, అనంతం కొన్ని రోజుల పాటు టీడీపీకి అనుకూల వాతావ‌ర‌ణం క‌నిపించింది. దాన్ని చేజేతులా చంద్ర‌బాబే పోగొట్టార‌నే విమ‌ర్శ టీడీపీ నేత‌ల నుంచే రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.