ఇంకా ఎన్నికల షెడ్యూలే రాలేదు. అప్పుడే ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో బెట్టింగ్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా వ్యాపారాలకు పేరొందిన ప్రొద్దుటూరు పట్టణంలో బెట్టింగ్స్ జోరందుకున్నాయి. వైసీపీకి 75 సీట్లు రావని రూపాయికి రూపాయి నిష్పత్తిలో ఒక రకం బెట్టింగ్ జరుగుతోంది. వైసీపీకి 100 సీట్లు రావని రూపాయికి రెండు రూపాయల వంతున బెట్టింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
వైసీపీకి 100 సీట్లు వస్తాయని ఎవరైనా పందెం కాస్తే, తాము రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని టీడీపీ అభిమానులు బహిరంగంగానే అడిగి మరీ పందెం కాస్తున్నారు. మరోవైపు టీడీపీ అభిమానులు 75 సీట్లకు మించవని పందెం కాయడానికి కూడా రెడీ అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం, సమీకరణలు ఎవరెకి మేలు చేస్తాయనే కోణంలో మీడియా ప్రతినిధుల్ని, రాజకీయ విశ్లేషకుల్ని ఆరా తీస్తున్నారు.
అలాగే ప్రొద్దుటూరులో టీడీపీ టికెట్ ఎవరికిస్తారు? ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై కూడా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టికెట్ ఇస్తే టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రొద్దుటూరు టికెట్ ప్రవీణ్‌కే దక్కుతుందని మరికొంత మంది బెట్టింగ్స్ పెడుతున్నారు.
ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఈ దఫా టీడీపీకి మూడు సీట్లు దక్కుతాయని బెట్టింగ్స్ సాగుతున్నాయి. ఒక్కో నియోజకవర్గంపై కూడా వేర్వేరు పందేలు నడుస్తున్నాయి. మొత్తానికి సీఎం సొంత జిల్లాలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ ఏదో రకమైన బెట్టింగ్స్ సాగే వాతావరణం కనిపిస్తోంది.