డెలివరీ అనగానే మనకు ఫుడ్ డెలివరీ లేదా నిత్యావసర సరుకుల డెలివరీ గుర్తొస్తుంది. మరి డ్రగ్స్ కూడా డోర్ డెలివరీ చేస్తారా? తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి వ్యవహారాన్ని బయటపెట్టారు పోలీసులు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు, డ్రగ్ డెలివరీ చేస్తున్నట్టు గుర్తించి, అరెస్ట్ చేశారు.
మచ్చ పవన్, ఆదర్శ్ సింగ్.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ లో బాయ్స్ గా పనిచేస్తున్నారు. రోజువారీ సంపాదన బాగానే ఉంది. కానీ ఇంకా ఎక్కువ సంపాదించాలని భావించారు. దీని కోసం డ్రగ్స్ ను అమ్మాలని నిర్ణయించుకున్నారు. తమ వృత్తిని, డ్రగ్స్ సరఫరాకు ఆధారంగా మార్చుకున్నారు.
అనుకున్నదే తడవుగా ఇద్దరూ బెంగళూరు వెళ్లారు. అక్కడ ఎండీఎంఏ లాంటి 2 రకాల మాదక ద్రవ్యాల్ని కొనుగోలు చేశారు. వాటిని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో డోర్ డెలివరీ చేయడం, పబ్బులకు సప్లయ్ చేయడం మొదలుపెట్టారు.
బైక్ వెనక డెలివరీ బ్యాక్, అందులో ఫుడ్. బ్యాగ్ కింద మాత్రం డ్రగ్స్. చాన్నాళ్లు పోలీసులకు కూడా అనుమానం రాలేదు. ఎప్పుడైతే డెలివరీ బాయ్స్ పబ్స్ వద్ద ఎక్కువగా కనిపించారో అప్పుడు అనుమానం వచ్చింది. తీగ లాగితే డొంక కదిలింది. ఈ ఇద్దరి నుంచి 8 లక్షల రూపాయల విలువైన మాదకద్రవ్యాల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.