సర్వోన్నత న్యాయస్థానంలోనూ జగన్ సర్కార్‌కు తిరుగులేని విజయం దక్కింది. రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వానికి ఇక అడ్డంకులన్నీ తొలగినట్టైంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో జస్టిస్ కె ఎం. జోసెఫ్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్5 జోన్‌లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో కూడా వాళ్లకు ఎదురు దెబ్బ తగిలింది.
హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం విశేషం. దీంతో రాజధానిపై ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఉత్కంఠకు తెర తొలగింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
చట్టం ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పేర్కొంది. అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
తాజా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జగన్ సర్కార్‌కు భారీ ఊరల లభించింది. దీంతో 51 వేల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు మార్గం సులువైంది. ఇప్పటికే ప్రభుత్వం ఆ పనిలో నిమగ్నమైంది. సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు రావడంతో ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయనుంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకునే శక్తులకు ఇక అన్నీ దారులు మూసుకుపోయినట్టే.