జగన్‌కు చంద్రబాబునాయుడు రాజకీయ అనుభవమంత వయసు వుంటుంది. అలాంటి యువనాయకుడు చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. రాజకీయ చరమాంకలో తనకు ఇలాంటి దుస్థితి వస్తుందని బహుశా కలలో కూడా చంద్రబాబు ఊహించి వుండరు. 2024లో కుప్పంలో ఏమవుతుందో తెలియదు. కానీ ప్రస్తుతం అక్కడ రాజకీయ వాతావరణం చూస్తుంటే, చంద్రబాబుకు కౌంట్‌డౌన్ మొదలైందా? అని టీడీపీ శ్రేణులు కూడా అనుమానించే పరిస్థితి.
వై నాట్ 175/175, టార్గెట్ కుప్పం నినాదాలతో వైసీపీ హోరెత్తిస్తోంది. ఇవాళ జగన్ సభ సూపర్ సక్సెస్. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడైన ఎంపీ మిథున్‌రెడ్డి పట్టుదల ఉన్నాయి. అందుకే చంద్రబాబు కూడా పదేపదే పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ హెచ్చరిస్తుంటారు.
రాష్ట్ర వ్యాప్తంగా కుప్పం గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలిచింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. కుప్పం అంటే చంద్రబాబు అడ్డా అనుకునేవాళ్లు. దాని గురించే ప్రత్యర్థులు కూడా పట్టించుకునే వాళ్లు కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే పట్టుదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది. ఈ నేపథ్యంలో కుప్పంలో టీడీపీ ఓటమిపై చంద్రబాబును జగన్ హిప్నటైజ్ చేస్తున్నారు. పదేపదే “నువ్వు ఓడిపోతావు, నువ్వు ఓడిపోతావు” అని జగన్ మానసికంగా గేమ్ ఆడుతున్నారు.
తాను ఓడిపోతాననే కంటే, జగన్ ఓడగొడతారనే భయం మాత్రం చంద్రబాబును కలవరపెడుతోంది. కుప్పం సభకు ముఖ్యంగా మహిళలు పోటెత్తారు. కుప్పంపై జగన్ వరాల జల్లు కురిపించారు. చంద్రబాబు రాజకీయానికి 44 ఏళ్లైతే, కుప్పం నుంచి 33 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తూ చేసిన మేలేంటని జగన్ గట్టిగా నిలదీశారు. కానీ తన మూడేళ్ల పాలనలో కుప్పానికి చేసిన మంచి పనులేంటో సభా వేదికపై నుంచి జగన్ వివరించారు.
కుప్పం అభివృద్ధిని పట్టించుకోని చంద్రబాబుకు ఓట్లు వేయాల్సిన అవసరం ఉందా? అని ఆయన ప్రశ్నించడం ఓ ఆలోచన రేకెత్తించింది. కుప్పంలో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన అభ్యర్థించడం సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసేలా ఉంది. అసలే కుప్పం జనాలు అమాయకులు. జగన్ హామీలకు ఎక్కడ తలొగ్గుతారోననే ఆందోళన టీడీపీలో వుంది. వైసీపీ హంగామా చూస్తే… చంద్రబాబు ఓడిపోతున్నట్టు, భరత్ గెలుస్తున్నంతగా సందడి నెలకుంది. ఎటూ అధికారంలోకి రాలేని టీడీపీకి ఓటు వేయడం ఎందుకు? ఒక్కసారి భరత్‌కే అవకాశం ఇస్తే ఎలా వుంటుందనే ఆలోచన కుప్పం ప్రజానీకంలో రానంత వరకూ టీడీపీ సేఫ్.
మనసు ఎప్పుడూ ఒకేలా వుండదు. ఎవరి మనసు ఎప్పుడెలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. కుప్పంలో వైసీపీ ఓడిపోతే ఆ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు. కానీ టీడీపీ ఓడిపోతే? ఆ ఆలోచన ప్రధాన ప్రతిపక్ష పార్టీలో భూకంపం సృష్టిస్తుంది. మొత్తానికి చంద్రబాబూ… నిన్ను ఓడగొడుతున్నామంటూ జగన్ హిప్నటైజ్ చేస్తున్నారనేది వాస్తవం. చంద్రబాబు కూడా ఇరిటేట్ అవుతున్నారనేది కూడా అంతే నిజం.