దుష్ట చతుష్టయం ఊపిరి పీల్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం అంటే చాలు… తప్పకుండా దుష్టచతుష్టయం ప్రస్తావన వుండి తీరాల్సిందే. చివరికి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దుష్టచతుష్టయాన్ని విడిచి పెట్టలేదు. అదేంటో గానీ ఇవాళ కుప్పంలో ఆ విషయాన్ని మరిచిపోయారు.
వైఎస్సార్ చేయూతలో భాగంగా మూడు విడతలో లబ్ధిదారుల ఖాతాలకు కుప్పం వేదికగా జగన్ డబ్బు జమ చేశారు. అలాగే కుప్పంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కుప్పంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేయడం గమనార్హం.
ఇక్కడి ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడాలంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కుప్పానికి నాన్ లోకల్, హైదరాబాద్‌కు లోకల్ అని విమర్శించారు. ఆయనకు హైదరాబాద్‌పై ఉన్న ప్రేమ కుప్పంపై లేదని విమర్శించారు. అందుకే హైదరాబాద్‌లో పెద్ద భవంతి నిర్మించుకున్నారన్నారు. కనీసం కుప్పంలో ఇల్లు, ఓటు కూడా చంద్రబాబుకు లేవని విమర్శించారు. కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. కానీ ఆయన ఏం చేయలేదో చెప్పాల్సింది ఎంతో ఉందని విమర్శించారు.
కుప్పాన్ని తన సొంత నియోజకవర్గంగా భావించి అభివృద్ధి చేస్తానన్నారు. కుప్పం నుంచి వైసీపీ నేత భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. బీసీలకు తానేదో చేశానని రెండు రోజుల క్రితం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు గొప్పలు చెప్పారన్నారు. బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. వారిని వాడుకుని వదిలేశారని విమర్శించారు.
బీసీల నియోజకవర్గమైన కుప్పాన్ని చంద్రబాబు ఆక్రమించారని విమర్శించారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఎంతో చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని మరో మూడు మండలాల అభివృద్ధికి ఎమ్మెల్సీ భరత్ సూచన మేరకు రూ.100 కోట్లు మంజూరు చేస్తానన్నారు. జనంలో బాగా తిరగాలని భరత్‌కు జగన్ సూచించారు.