ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓ టీడీపీ నాయకుడిని ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ అత్యంత బలంగా వుంది. అలాగని నిర్లక్ష్యం వహిస్తే… కొంప మునుగుతుందని జగన్కు బాగా తెలుసు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలతో జగన్ ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీకి బలంగా ఉన్న నేతలను తన వైపు తిప్పుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ నాయకుడు టీడీపీకి అన్ని రకాలుగా వెన్నముక అని గుర్తించారు. పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయనకు మంచి పేరు వుంది. ప్రజల్లో ఆయనకు పలుకుబడి వుంది. ఈ దఫా కర్నూలులో గెలిచే ఏకైక టీడీపీ నాయకుడు ఆయనే అని పలు సర్వే సంస్థల్లో తేలింది. పేరులో పురాతన కాలం ఉన్నప్పటికీ, వర్తమాన పరిస్థితులకు తగ్గట్టు ప్రజలకు చేరువయ్యే నాయకుడిగా ఆయనకు గుర్తింపు వుంది. తనతో పాటు మరికొందరికి ఆర్థికంగా మద్దతుగా నిలిచి, టీడీపీని గెలిపించే శక్తి సామర్ధ్యాలు ఆ నాయకుడికి ఉన్నాయనే సర్వే నివేదికలతో జగన్ అప్రమత్తం అయ్యారు.
ఇప్పటికే ఆయనపై వివిధ మార్గాల్లో వైసీపీ వల విసిరింది. టీడీపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, వైసీపీపై అసంతృప్తి లేకపోయినా, ఆ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని మధ్యవర్తులతో ఆయన అన్నట్టు చర్చ జరుగుతోంది. అయితే ఆ నాయకుడు వైసీపీలోకి వస్తే…ఇక ఆ జిల్లాలో పార్టీకి భవిష్యత్లో తిరుగుండదని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆయన్ను చేర్చుకునేందుకు జగన్ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ నాయకుడిపై సామ దాన దండోపాయాన్ని ప్రయోగించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
కేంద్ర బీజేపీ పెద్దలతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, సదరు టీడీపీ నాయకుడిపై ఐటీ దాడులు చేయించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల రీత్యా ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరిగే అవకాశం ఉంది.
ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలులోని టీడీపీ నాయకుడు వైసీపీలో చేరేందుకు ముందుకు రాకపోతే మాత్రం… జగన్ తన అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంది.