దాదాపు యాభై అరవై ఏళ్ళ కిందట దేశంలోగాని, తెలుగు రాష్ట్రాల్లో గానీ (అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం) ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ప్రతి ఇల్లు ఐదారుగురు, కొన్ని కుటంబాలు పదిమంది పిల్లలతో కళకళలాడుతుండేవి. సంపన్న వర్గాలైనా, మధ్యతరగతి కుటుంబాలైనా, పేద వర్గాలైనా చాలామంది పిల్లలు ఉండేవారు. క్రమంగా అనేక కారణాలవల్ల ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో మహా అయితే ముగ్గురు పిల్లలతో చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. దేశ జనాభా పెరుగుదల నేపథ్యంలో ఇందిరా గాంధీ హయాంలో కుటుంబ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచారం కూడా చిన్న కుటుంబాలు ఏర్పడటానికి కారణం.
ఇద్దరు లేదా ముగ్గురు చాలు, చిన్న కుటుంబం-చింతలు లేని కుటుంబం అనే నినాదాలు అప్పట్లో చాలా పాపులర్. మొదట్లో చిన్న కుటుంబం అంటే ముగ్గురు పిల్లలు అని భావించేవారు. కానీ క్రమంగా చాలా కుటుంబాలు ఇద్దరు పిల్లలకే పరిమితం అయ్యాయి. ఉమ్మడి కుటుంబాలు అంతరించి న్యూక్లియర్ ఫామిలీస్ ఏర్పడ్డాయి. పెద్ద కుటుంబాలు మంచివా, చిన్నవి మంచివా అనే చర్చ ఇప్పటికీ ఉంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనాభా పెరగాలని, లేదంటే సమాజానికి చాలా నష్టమని అంటున్నారు. ప్రతి ఒక్కరు (దంపతులు) ఎక్కువమంది పిల్లలను కనాలని బాబు చెబుతున్నారన్నమాట.
ఇదే విషయాన్ని ఆయన కొన్నేళ్ల కిందట కూడా చెప్పారు. అప్పట్లో ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ మళ్ళీ అదే పాట పాడుతున్నారు. దేశ జనాభా పెరగాలని చెబుతున్న బాబుకు లోకేష్ ఒక్కడే కుమారుడు. మళ్ళీ లోకేష్ కు కూడా ఒక్కడే కుమారుడు. తండ్రీ కొడుకులవి చిన్న కుటుంబాల్లో మరీ చిన్న కుటుంబాలని చెప్పుకోవచ్చు. ఆ సంగతి ఎలా ఉన్నా బాబు మాత్రం 2047 నాటికి దేశ జనాభా సగటు వయోభారం పెరిగే ప్రమాదం ఉందని..నియంత్రణ ఎత్తేసి జనాభా పెరుగుదలకు అవకాశం కల్పించాలని అంటున్నారు.
జనాభా పెరుగుదల భవిష్యత్తులో వరం అవుతుంది తప్పితే శాపం కాదని విశ్లేషించారు. బాబు చైనా దారిలో నడుస్తున్నట్లుగా ఉంది. ఒకప్పుడు చైనాలో ఒక్కరికంటే ఎక్కువమందిని కంటే తీవ్ర చర్యలు ఉండేవి. కఠినమైన ఆంక్షలు విధించేవారు. కానీ అక్కడ కొంతకాలంగా ఎక్కువమందిని కనండి అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.
ఇదే విధమైన ప్రచారం మరికొన్ని దేశాల్లోనూ సాగుతోంది. మన దేశంలో మాత్రం ఎలాంటి ప్రచారం లేకుండానే తక్కువమంది పిల్లలను కంటున్నారు.