నారా లోకేష్ బాబు సవాళ్లు విసురుతున్నారు. నా మీద చాలా చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా.. దమ్ముంటే ముందు వాటికి ఆధారాలు చూపించండి.. మీకు 24 గంటలు టైమిస్తున్నా అంటూ రెచ్చిపోతున్నారు. మీరు నన్నేమీ చేయలేరు అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేం మీలాగానే అవినీతికి పాల్పడి చిప్పకూడు తింటామని అనుకోవడం మీ అవివేకం అంటూ చినబాబు చాలా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు.
తన తండ్రి మూడోసారి ముఖ్యమంత్రి కాగానే.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా దొడ్డిదారిలో మంత్రి అయిపోయి.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా సభలోకి వచ్చిన వ్యక్తి నారా లోకేష్. పెద్దల సభ అని అందరూ అనుకునే శాసనమండలికి మచ్చతెచ్చేలా ఆయన పొలిటికల్ ఎంట్రీ జరిగింది. అప్పటినుంచి ఆయన మంత్రి పదవిని వాడుకుని అడ్డగోలుగా దోచుకున్నారనే పేరుంది.
తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి కొన్ని అనుమతులు, ఒప్పందాలు చేసుకున్నట్లుగా కూడా గుసగుసలు వినిపించాయి. లోకేష్ పాల్పడుతున్న అవినీతి గురించి.. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలోనే అంతా బాహాటంగా చెప్పుకున్నారు.
నిజం చెప్పాలంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. లోకేష్ అవినీతి గురించి గట్టిగానే మాట్లాడినప్పటికీ.. కొంత ఉపేక్షించారని అనుకోవాలి. అయితే వందల కోట్లు కాజేయడంలో ఆయనతో భాగం పంచుకున్న, ఆయనకు సహకరించిన పలువురి మీద మాత్రం చర్యలు తీసుకున్నారు. కొందరిని అరెస్టులు కూడా చేశారు. దర్యాప్తును చాలా వరకు ముందుకు తీసుకువెళ్లారు.
కానీ.. ఒకసారి పరాజయం పాలవగానే ఎక్కడివాళ్లక్కడ అలర్ట్ అయిపోయారు గనుక.. అంత సులువుగా దొరికిపోకుండా బుకాయించే ప్రయత్నాలతో నడిపిస్తున్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్, ఐటీ కంపెనీలకు రాయితీలు, ఉపాధి హామీ పనుల్లో కుంభకోణాలు.. ఇలాంటివి అనేకం లోకేష్ ఖాతాలో ఉన్నాయి. అన్నింటినీ లోకేష్ తన ట్వీట్లలో ఏకరవు పెడుతూ.. నా మీద ఆరోపణలు నిరూపించడం మీకు చేతకాదు అంటూ రెచ్చగొడుతున్నారు.
లోకేష్ మాటలను కాస్త లోతుగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. రాజకీయాలను పరిశీలించే అందరూ పప్పు నాయుడు అని ముద్దుగా పిలుచుకునే ఈ చినబాబుకు.. వచ్చే నెలలో తలపెట్టిన పాదయాత్ర చేయాలంటే చాలా భయం భయంగా ఉన్నట్టుంది. అందుకే ఎలాగో ఒకలాగా పాదయాత్రను ఎవాయిడ్ చేయాలనే వ్యూహరచన చేస్తున్నట్టుంది.
ప్రభుత్వాన్ని రెచ్చగొడితే తన మీద ఆధారాలు కూడా బయటకు తీసి అరెస్టు చేసి జైల్లో పెడతారేమో! అలాగైనా కొన్నాళ్లు నడిచేపనిలేకుండా హాయిగా రెస్టు తీసుకోవచ్చు అని చినబాబు ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అందుకే ఆయన అవినీతి గురించి ఇన్నాళ్లుగా ఎందరు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా.. ఇప్పుడు కాస్త అతిశయంగా రెచ్చిపోతున్నారు. ఏమో.. ఆయన కోరుకున్నట్టుగానే జరుగుతుందేమో!