ప్రతిపక్ష పార్టీలను, వాటి అనుబంధ ఎల్లో మీడియా సంస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెడుగుడు ఆడుకున్నారు. జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమానికి వినుకొండను వేదిక చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై విమర్శలకు వచ్చే సరికి… మళ్లీ జగన్‌లో పాత లీడర్ కనిపించారు. చాన్నాళ్ల తర్వాత జగన్‌లో మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా కనిపించింది.
జగన్ మాట్లాడుతున్నంత సేపూ సభా ప్రాంగణంలోని వేలాది మంది వైసీపీ కార్యకర్తల ఉత్సాహభరిత నినాదాలు ఆకట్టుకున్నాయి. టీ20 మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ సిక్సర్స్, ఫోర్స్ కొడుతుంటే, క్రికెట్ అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టిన వైనాన్ని ఇవాళ్టి వినుకొండ సభా ప్రాంగణం తలపించింది. సభలో జగన్ ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. శ్రేణుల్ని ఎన్నికల సమరానికి సమాయత్తం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు.
ఇదే ఒరవడి కొనసాగిస్తే మాత్రం…. ప్రతిపక్షాలకు దబిడిదబిడే అని చెప్పక తప్పదు. “మీ బిడ్డకు పొత్తుల్లేవు. మీ బిడ్డ వాళ్లమీద, వీళ్ల మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే సింహంలా వస్తాడు. తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు. కానీ మీ బిడ్డకు భయం లేదు. కారణం మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని (ప్రజల్ని), దేవుడ్ని మాత్రమే”
ఈ మాటలు చాలదా… వైసీపీ శ్రేణుల్ని ఎన్నికల సమరానికి సిద్ధం చేయడానికి? మీరు అభిమానించే నాయకుడు సింహంలా వస్తున్నాడని, ప్రతిపక్షాలు, వాటికి జాకీలు వేసే మీడియా సంస్థలన్నీ తోడేళ్లలా కలిసికట్టుగా వస్తున్నాయని జగన్ తన మార్క్ మాటలతో ఎదురు దాడికి దిగారు. జగన్ ప్రసంగం మోటివేట్ చేస్తున్న భావన కలగడంతో కార్యకర్తలు కూడా… అంతే ఉత్సాహంతో సభా ప్రాంగణం అంతా మార్మోగేలా కేకలు వేయడం విశేషం. ఇవాళ్టి జగన్ ప్రసంగంలో ప్రత్యేకత ఏమంటే… చంద్రబాబును ముసలాయనగా అభివర్ణించడం. తద్వారా చంద్రబాబు రాజకీయానికి కాలం చెల్లిందని చెప్పకనే చెప్పారు.
జగన్ ఎప్పట్లాగే ఎల్లో మీడియాను ఉతికి ఆరేశారు. వీళ్లంతా కలిసి వచ్చినా తననేం చేయలేరని తేల్చి చెప్పారు. చంద్రబాబు నమ్ముకున్నదెవరిని? తాను నమ్ముకున్నదెవరినో జగన్ స్పష్టం చేశారు. జగన్ మాటల్లోనే ఆయన నమ్మకాల గురించి తెలుసుకుందాం.
“నాకు ముసలాయన మాదిరి ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు. టీవీ5 తోడుగా ఉండక పోవచ్చు. దత్త పుత్రుడు నా కోసం మైకు పట్టుకోకపోవచ్చు. నేను వాళ్లను నమ్ముకోలేదు. నేను నమ్ముకున్నది ఎవరినో తెలుసా? నా ఎస్సీలను, నా బీసీలను, నా ఎస్టీలను, నా మైనార్టీలను, నా నిరుపేద వర్గాలను”
ప్రజల్ని తన వైపు తిప్పుకోవడం ఎలాగో జగన్‌ను చూసి ఎవరైనా నేర్చుకోవాలనేంతగా ఈ సభలో ఆయన మాటలున్నాయి. అణగారిన వర్గాలను తనవిగా ఆయన పదేపదే చెప్పడం విశేషం. దేవుడి దయ, మీ అందరి (ప్రజల) చల్లని దీవెనలు తప్ప….తనకేమీ లేవని చెప్పడం ద్వారా జగన్ ఆకట్టుకునే ప్రయత్నం కనిపించింది. జగన్ ప్రసంగానికి తోడు, ఆయన హావభావాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి వినుకొండ సభతో రానున్న రోజుల్లో జగన్ చేసే ఎన్నికల సమరం ఎలా వుంటుందో ఒక ట్రైలర్‌గా భావించొచ్చు.