శుభమా అని లోకేశ్ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. తండ్రి వయసు పైబడుతుండడంతో పార్టీ బాధ్యతల్ని తీసుకోవాలని లోకేశ్ తహతహలాడుతున్నారు. అయితే నాయకత్వ సమర్థతను నిరూపించుకునేందుకు లోకేశ్ తన కాళ్లకు పని చెప్పారు. కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టారు. ఇలా ఆయన నడక స్టార్ట్ చేసి వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడ్డానికి ముందుకొచ్చారు.
అసలే టీడీపీ కార్యకలాపాల్లో కావాల్సినంత డ్రామా వుంటుంది. అయితే అది పైకి కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ లోకేశ్ చుట్టూ వుండే బ్యాచ్ ఎలాంటిదంటే… సియ్యలు తింటున్నామని, ఎముకలు మెడలో వేసుకునే బాపతు. ఈ ధోరణే నెటిజన్లకు కావాల్సినంత పని పెట్టింది. లోకేశ్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారంటే… తక్కువే అవుతుంది.
పాదయాత్రలో భాగంగా లోకేశ్ కూరగాయలు అమ్ముకునే మహిళ వద్దకు వెళ్లారు. ఆమె పరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆ ఫొటోను టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేయగా, అందులో దర్శకత్వ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు విమర్శలకు పదును పెట్టారు.
కూరగాయల వ్యాపారులు ఎల్లో కలర్ మెటీరియల్ వాడటం, అలాగే, ఒక కుటుంబానికి కూడా సరిపోనంత తక్కువ పరిణామంలో కూరగాయలు ఉన్నాయని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. యువగళం సినిమా డైరెక్టర్ ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలమ్మా అంటూ లోకేశ్ టీమ్‌ను నెటిజన్లు దెప్పి పొడవడం గమనార్హం. పాపం లోకేశ్.