జగన్.. ఇది చాలా వెనుకబాటు ఆలోచన!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ ఎడ్యుకేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన రీతిలో అమలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. పిల్లలు డిజిటల్ విద్యకు అలవాటు పడడం ద్వారా రేపటి తరానికి దీటైన పౌరులుగా తయారు…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ ఎడ్యుకేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన రీతిలో అమలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. పిల్లలు డిజిటల్ విద్యకు అలవాటు పడడం ద్వారా రేపటి తరానికి దీటైన పౌరులుగా తయారు కావాలనేది ఆయన ఆకాంక్ష. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని స్కూళ్లలోనూ డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు అవుతున్నాయి. 

ఆ మాధ్యమంలో పిల్లలకు విద్యాబోధన జరుగుతోంది. దీనికి అదనపు సదుపాయంగా మాత్రమే ఎనిమిదవ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్ లు ఇవ్వడం కూడా పూర్తిచేశారు. ఈ ట్యాబ్ ల ద్వారా పిల్లలు నేర్చుకునే ప్రమాణాలు మెరుగుపడతాయనేది నమ్మకం. టాబ్ లలో ముందే లోడ్ చేసిన వీడియో పాఠాల ద్వారా వారికి మరింత మెరుగ్గా విద్యను అందించాలని కోరిక. ఇలా డిజిటల్ యుగానికి దీటైన రేపటి పౌరులను తయారు చేస్తున్నారు.

ఇంతటి విప్లవాత్మక నిర్ణయాలతో ఏపీలో విద్యారంగాన్ని ముందుకు తీసుకు వెళుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా కొన్ని వెనుకబాటు ఆలోచనల నుంచి బయటకు రావడం లేదు. రాష్ట్రంలోని పిల్లలందరికీ డిక్షనరీలు ఇవ్వాలని ఆయన అధికారులకు సూచిస్తున్నారు. ఇప్పటికే డిక్షనరీలు పిల్లల్లో ఎవరెవరి వద్ద లేవో ఆ వివరాలు గుర్తించి వారందరికీ వచ్చేఏడాది విద్యా కానుకతో పాటు అందే ఏర్పాటు చేయాలని మార్గదర్శనం చేస్తున్నారు. గతంలో కూడా విద్యా కానుకలో భాగంగా పిల్లలకు డిక్షనరీలు ఇవ్వడం జరిగింది.

ఇప్పుడు డిక్షనరీలు లేని వాళ్ళందరికీ మళ్ళీ డిక్షనరీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. పుస్తకం రూపంలో ఇచ్చే డిక్షనరీల ద్వారా సీఎం వెనుకబాటు తనం తో కూడిన ఆలోచన చేస్తున్నారేమో అనిపిస్తోంది. పిల్లలకు ట్యాబ్ లను పంపిణీ చేసిన తర్వాత వారికి డిజిటల్ డిక్షనరీలని అందిస్తే మరింత బాగుంటుంది కదా అనేది నిపుణుల అభిప్రాయం.

ఆన్ లైన్ లో అనేక డిక్షనరీలను కలిపి అర్థాలను చూపించే ఏర్పాట్లు చాలా ఉన్నాయి. ఆఫ్‌లైన్లో లభించేలా తయారు చేయించుకుని పిల్లల ట్యాబ్ లలో ఒకసారి లోడ్ చేస్తే వారికి జీవితాంతం ఉపయోగపడుతుంది కదా అని పలువురు సూచిస్తున్నారు. డిక్షనరీ పుస్తకాల కొనుగోలు, వ్యయం, కాగితపు పుస్తకాల ముద్రణ రూపేణా పర్యావరణానికి హాని జరగడం ఇవన్నీ కూడా డిజిటల్ డిక్షనరీలను అందించడం ద్వారా తగ్గించవచ్చునని సూచిస్తున్నారు. విద్యారంగాన్ని సంస్కరించే ప్రయత్నంలో ఎన్నో ఆధునిక పోకడలకు శ్రీకారం చుడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎందుకిలా వెనుకబాటు ఆలోచనలు చేస్తున్నారనేది అర్థం కావడం లేదు.

డిక్షనరీల ఆలోచనను కాస్త దిద్దుకుని, పిల్లలకు ఇచ్చిన ట్యాబ్ లు అన్నింటిలో డిజిటల్ డిక్షనరీలను లోడ్ చేయిస్తే బాగుంటుంది.