జీవో నంబర్ -1పై తగ్గేదే లే అని ఏపీ సర్కార్ అంటోంది. ఇటీవల ఈ జీవో ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. తనను తిరగనివ్వకుండా చేసేందుకే జగన్ సర్కార్ ఈ జీవో తీసుకొచ్చిందనేది చంద్రబాబు ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఆయన ఆంక్షల నడుమే కుప్పం పర్యటనలో వున్నారు. ఈ నేపథ్యంలో జీవోపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.
జీవో నంబర్-1ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించే ప్రశ్నే లేదని అంబటి తేల్చి చెప్పారు. ఈ జీవో అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందన్నారు. తమ పార్టీ కూడా అతీతం కాదని ఆయన అన్నారు. కుప్పంలో చంద్రబాబు జీవో నిబంధనలను పాటించలేదని తప్పు పట్టారు. పిచ్చి కుక్క మాట్లాడినట్టుగా కుప్పంలో చంద్రబాబు అరుస్తున్నారన్నారు. ఈ జీవో ప్రకారం రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టకూడదని మరోసారి స్పష్టం చేశారు.
చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ జనం పిట్టల్లా రాలిపోతున్నారని వాపోయారు. ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదా? అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు జనంలో తిరిగితే ఏమవుతుందని మంత్రి ప్రశ్నించారు. గతంలో తిరిగితే ఏమైందో అందరూ చూశారని ఆయన అన్నారు. చంద్రబాబు జనంలో తిరిగిన తర్వాతే కదా 23 స్థానాలకు పరిమితం చేసిందని ఆయన వెటకరించారు.
కుప్పంలో కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలను కూడా గెలిపించుకోలేకపోయారని ఆయన అన్నారు. నా కుప్పం నా కుప్పం అంటూ చంద్రబాబు రంకెలేస్తున్నారని, కనీసం అక్కడ ఇల్లు, ఓటు కూడా లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెళ్లిన చోటల్లా శని దాపురిస్తుందని ఎద్దేవా చేయడం గమనార్హం.