ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిస్థితి దయనీయంగా మారింది. బీజేపీలో వలస నేతలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఏపీ బీజేపీ వర్గాలుగా విడిపోయింది. వలస, ఒరిజినల్ నేతలుగా బీజేపీ విడిపోయిందన్నది వాస్తవం. ముఖ్యంగా వలస నేతలంతా టీడీపీ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారనే వాదన ఎప్పటి నుంచో వుంది. వలస నేతల పుణ్యమా అని బీజేపీలో క్రమశిక్షణ కట్టు తప్పింది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై బహిరంగంగా విమర్శలు గుప్పించినా పట్టించుకునే దిక్కులేదు. తాజా పరిణామాలు ఏపీ బీజేపీలోని డొల్లతనాన్ని బయట పెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి వలస వెళ్లిన కన్నా లక్ష్మినారాయణను ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేశారు. కన్నా పదవీ కాలం పూర్తియిన తర్వాత ఆయన స్థానంలో సోము వీర్రాజును నియమించారు. అప్పటి నుంచి కన్నా లక్ష్మినారాయణ జీర్ణించుకోలేకున్నారు. చిన్న అవకాశం దొరికినా వీర్రాజుపై విమర్శలు చేయడానికి వెనుకాడడం లేదు.
మిత్రపక్షమైన జనసేనను తమతో కలిసి నడిచేలా చేయడంలో వీర్రాజు విఫలమయ్యారని మొదటగా కన్నా ఫైర్ అయ్యారు. వీర్రాజు వైఖరి వల్లే బీజేపీకి పవన్‌కల్యాణ్ దూరమయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కన్నాను జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ కలిశారు. వర్తమాన రాజకీయాలపై చర్చించుకున్నారు. రెండు రోజుల క్రితం మరోసారి వీర్రాజుపై తీవ్రస్థాయిలో కన్నా విరుచుకుపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును సాకుగా తీసుకుని విమర్శలను వీర్రాజుపై కన్నా ఎక్కుపెట్టారు. తాను జనసేనాని పవన్‌కు అండగా వుంటానని కన్నా బహిరంగంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కన్నా తనపై చేసిన విమర్శలకు సంబంధించి ఇంగ్లీష్‌లో రాసి అధిష్టానానికి సోము వీర్రాజు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నాపై చర్యలు తీసుకోవాల్సిందే అని అధిష్టానం పెద్దల వద్ద వీర్రాజు పట్టు పడుతున్నట్టు సమాచారం. జనసేనలోకి వెళ్లేందుకు అన్నీ మాట్లాడుకుని, పార్టీని బద్నాం చేయడానికే విమర్శలు చేస్తున్నారనే వాదన వీర్రాజు వినిపిస్తున్నారని సమాచారం.
వరుసగా రెండోసారి తనపై కన్నా విమర్శలు చేశారని గుర్తు చేస్తూ, క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే మరికొందరు నోరు పారేసుకుంటారనే భయాన్ని వీర్రాజు వ్యక్తం చేశారని తెలిసింది. వీర్రాజు విన్నపాన్ని, ఆవేదనను బీజేపీ అధిష్టానం ఎంత వరకూ పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.