ఫేషియల్ అటెండెన్స్ పై జగన్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగ సంఘాల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా ప్రభుత్వం మాత్రం తలొగ్గడం లేదు. అసలే అధికార పార్టీ, ఉద్యోగుల మధ్య ఓ రేంజ్‌లో వార్ నడుస్తోంది. ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అవలంబిస్తోందన్న ఆవేదన ఉద్యోగ సంఘాల్లో ఉంది. దీంతో ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా…. తమపై వ్యతిరేకతతోనే అని ఉద్యోగులు ఆలోచిస్తున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు తమకు ఫేషియల్ అటెండెన్స్ వద్దని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. నిజానికి గత నెల 16వ తేదీనాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను అమలు చేయాల్సి వుంది. వివిధ కారణాల వల్ల ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఫేషియల్ అటెండెన్స్‌పై మరోసారి ఇవాళ ఏపీ ప్రభుత్వం రిమైండర్ మెమో జారీ చేయడం గమనార్హం.
ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ ఫేషియల్ అటెండెన్స్‌ను ఏపీఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ను ఉపయోగించి ప్రతి ఒక్కరూ ఆఫీసుల్లో నమోదు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ చాలా మంది ఫేషియల్ అటెండెన్స్‌లో ఎన్‌రోల్ కానట్టు సమాచారం వచ్చిందన్నారు.
ఇందు కోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని ఆయన సూచించారు. ఇక మీదట ఏపీఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారానే ముఖాధారిత అటెండెన్స్ నమోదు చేయాలని తేల్చి చెప్పారు. తమ ఆదేశాలను పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు.