పార్టీ మారడం పక్కా అని, అయితే అది ఏదనేది త్వరలో చెబుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్‌ను నమ్ముకుని వస్తే, సిట్టింగ్ ఎంపీ అయిన తనకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన మనసులో రగిలిపోతున్నారు. కానీ అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. మరో 10 నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై పొంగులేటి సీరియస్‌గా ఆలోచిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఆయన ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో తన అనుచరులను సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
బీఆర్ఎస్‌కు దమ్ముంటే, చేతనైతే తనను సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. అధికారం శాశ్వతం కాదని గుర్తించుకోవాలని ఆయన హితవు పలికారు. తన వాళ్లను అధికారులు ఇబ్బంది పెడితే… చక్రవడ్డీతో సహా చెల్లిస్తానని పొంగులేటి హెచ్చరించారు. తన పార్టీ మార్పుకు సంబంధించిన సమాచారం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని అన్నారు. పార్టీ మారడం ఖాయమని స్పష్టం చేశారు.
బీజేపీలో అని కొందరు, అలాగే షర్మిల పార్టీలో చేరుతానని మరికొందరు డేట్లతో సహా ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే తన ఆత్మీయులు, వందలాది మంది కార్యకర్తల అభిప్రాయం మేరకే ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని స్పష్టం చేశారు. ఫలానా పార్టీ అని తెలియకుండానే అభ్యర్థులను ప్రకటించడంపై కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. తాను ఏ పార్టీలో చేరితే, ఆ పార్టీ అభ్యర్థులుగా తాను ప్రకటించిన నాయకులు బరిలో నిలుస్తారన్నారు. అది తన సత్తా అని ఆయన అన్నారు.