తప్పు చేయడం…. ఎప్పటికీ తప్పు కాదు. అది తప్పని తెలిసి కూడా చేయడమే నేరం. తప్పుని సరిదిద్దుకోకపోవడం అహంకార మవుతుంది. చేసిన తప్పుని ఒప్పుకుని, క్షమాపణ చెప్పడం సంస్కారం. అయితే తప్పుని ఒప్పుకోడానికి అగ్రహీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి అహం అడ్డొచ్చింది. చిత్ర పరిశ్రమకే ఆయన పరిమితమై వుంటే… ఆయన ఎన్ని తప్పులు చేసినా తెలిసేవి కావు. ఆయన తప్పుల్ని ప్రశ్నించే పరిస్థితి వుండేది కాదు.
కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి స్వయాన బామ్మర్ది కూడా. దీంతో బాలయ్యకు సంబంధించి ప్రతి కదలిక, మాటను ప్రజానీకం గమనిస్తోంది. ఏ మాత్రం మాట తప్పుగా దొర్లినా వెంటనే విమర్శలు వెల్లువెత్తుతాయనే గమనంలో పెట్టుకుని, జాగ్రత్తగా నడుచుకోవాల్సి వుంటుంది. అబ్బే… బాలయ్య అలా చేయనే చేయరు కదా? ఎందుకంటే తానో ప్రత్యేకంగా ఆకాశం నుంచి దిగివచ్చాననే ఫీలింగ్ అనే విమర్శలు లేకపోలేదు.
ఓటీటీ ఫ్లామ్లో బాలయ్య హోస్ట్‌గా ఓ టాక్ షో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో నర్సులపై బాలయ్య నోరు జారారు. తనకు వైద్య సేవలు అందించిన నర్సు అందం గురించి వెకిలిగా మాట్లాడ్డంపై నర్సులు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు నర్సుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. దీంతో బాలయ్య దిగిరాక తప్పలేదు. అయితే పశ్చాత్తాపం వ్యక్తం చేయడంలోనూ ఆయన రాజకీయ బుద్ధిని ప్రదర్శించడం గమనార్హం.
తాను తప్పు చేయడమే కాకుండా, అది అసత్య ప్రచారమని, ఖండిస్తున్నానని బాలయ్య సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టడం విశేషం. తన మాటలను కావాలనే వక్రీకరించారని నిష్టూరమాడారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం అని చెప్పుకొచ్చారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. రాత్రింబవళ్లు రోగులకు సేవలు చేసి సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నర్సులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు.
నిజంగా తన మాటలు నర్సుల మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని ఆయన ముక్తాయింపు ఇచ్చారు. బాలయ్య వ్యాఖ్యలు కించపరిచేలా లేకపోతే నర్సులకు పనిలేక ఆందోళనలు చేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. గౌరవంగా కూడా నర్సులను తిడ్తావా బాలయ్యా? అంటూ ప్రశ్నించే వాళ్ల సంఖ్య తక్కువేం లేదు.