అల్లు అరవింద్ అజాతశతృవే కాదు. తెలివైన వారు కూడా. చేతికి మట్టి అంటకుండా పని చేయించుకోగలరు. చక్రం తిప్పనూ గలరు. గడచిన ఇరవై నాలుగు గంటల్లో అదే జరిగింది. ఈ సినేరియా అంతా ఎలా వుందీ అంటే..
గత కొన్ని వారాలుగా తనకు ఓ సినిమా చేయమని నిర్మాత దిల్ రాజు హీరో విజయ్ దేవరకొండను సంప్రదిస్తున్నారు. అది ఓ కొలిక్కి వచ్చి నిన్న సాయత్రం ప్రకటన ఇవ్వాలనుకున్నారు.
నిన్న ఉదయమే దిల్ రాజు-పరుశురామ్-విజయ్ దేవరకొండ సినిమా ప్రకటన రాబోతోంది అంటూ ‘గ్రేట్ ఆంధ్ర’ వెల్లడించేసింది. దాంతో ఒక్కసారిగా అల్లు అరవింద్ క్యాంప్ ఉలిక్కిపడింది. ఎలా లీక్ అయింది అంటూ పీఆర్ టీమ్ మీద దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. బన్నీ వాస్ ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యారు. ఇలాంటి టైమ్ లో ఈ లీకులు అన్నీ ఏమిటి? అంటూ దిల్ రాజును అరవింద్ కనుక్కున్నారు. దానికి దిల్ రాజు దగ్గర నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు కాస్త అటు ఇటుగా ఓ సమాధానం మెసేజ్ రూపంలో వచ్చింది. ‘’ మీ దర్శకుడుని నేనెందకు టచ్ చేస్తారు సర్ ‘’ అంటూ. దాంతో అరవింద్ సైలంట్ అయ్యారు.
సాయంత్రానికి దర్శకుడు పరుశురామ్ దంపతులు వచ్చి అరవింద్ ను కలిసే ప్రయత్నం చేసారు. కానీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దిల్ రాజుకు నచ్చ చెబుతామని, రెండు బ్యానర్లు కలిసి సినిమా చేసేలా చూస్తామని సందేశం పంపారు. దానికి అల్లు అరవింద్ అవసరం లేదని సమాధానం పంపారు.
ఇలాంటి నేపథ్యంలో సాయంత్రం ప్రెస్ మీట్ అని మీడియాకు సమాచారం పంపారు. సాయంత్రం అన్నపుడే అసలు కీలకం దాగి వుంది. అంటే సాయంత్రం వరకు టైమ్ గ్యాప్ వుంచుకుంటున్నారు అని.
కానీ అక్కడితో ఆగలేదు.. పరుశురామ్ మీద మాట్లాడతారు అంటూ మీడియాకు కావాలని లీకులు అందించారు. అదీ అసలు కీలకం. ఇలా లీకులు సమస్త మీడియాలకు, సమస్త పీఆర్ టీమ్ జనాలు ఇవ్వడం విశేషం. ఎవరో ఒకరికి..ఒకరు లీక్ ఇవ్వడం వేరు. టీమ్ టీమ్ అంతా చిన్న పెద్ద బుల్లి బుచ్చి మీడియా దగ్గర నుంచి టాప్ మీడియా వరకు అందరికీ ‘రాసుకోండి..రాసుకోండి’ అంటూ లీకులు ఇవ్వడం వేరు. దాంతోనే ఇదేదో మాంచి వ్యూహరచన అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అంత సీనేం లేదు..ప్రెస్ మీట్ క్యాన్సిల్ అవుతుంది చూడండి అంటూ దిల్ రాజు క్యాంప్ తో మంచి సంబంధాలు వున్న ఓ దర్శకుడు, నిర్మాత ఇలా చాలా మంది ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఫోన్ లు చేసారు.
ఆఖరకు ఆ ముచ్చటే జరిగింది. ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం వుంది అంటూ మళ్లీ సమాచారం. ఏమి? ఎందుకు? ఎలా? అని అడిగితే…’చాంబర్ ఎన్నికలు వున్నాయి కదా..ఇప్పుడు అంత బాగోదు’ అంటూ ఓ డీఫాల్ట్ ఆన్సర్. అది కాదు అని అందరికీ తెలుసు. కానీ అసలు ఏం జరిగిందో అన్నది వేరే.
నిన్న సాయంత్రం సినిమా ప్రకటన వచ్చిన వెంటనే దర్శకుడు పరుశురామ్ సతీ సమేతంగా వచ్చి అల్లు అరవింద్ ను కలిసే ప్రయత్నాలు చేసారు. కానీ కలిసేందుకు అల్లు అరవింద్ ఇష్టపడలేదు. వెనుతిరిగి వెళ్లిపోయారు.
ఈరోజు ప్రెస్ మీట్ అన్న వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచీ మళ్లీ హాజరు. అల్లు అరవింద్ ఇంటి దగ్గర పడిగాపులు. ఆఖరికి అపాయింట్ మెంట్ దొరికింది. తన అసంతృప్తి అంతా ఏ రేంజ్ లో, ఏ భాషలో వెళ్లగక్కారో తెలియదు కానీ చివరకు ఒక మాట మాత్రం అన్నారని తెలుస్తోంది.’’ఇక మీకు ఏ అవసరం వచ్చిన అరవింద్ ను అయితే మరిచిపోండి..’’ అని వ్యవహారం క్లోజ్ చేసారు.
దిల్ రాజు విషయంలో కూడా అల్లు అరవింద్ బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. తనకు ‘మీ డైరక్టర్ ను ఎందుకు టచ్ చేస్తాను’ అని. మెసేజ్ పెట్టి, సాయంత్రం ప్రకటన ఇవ్వడం అన్నది అరవింద్ ను బాగా హర్డ్ చేసింది. ఇక దిల్ రాజుతో సంబంధాలు అంతంత మాత్రమే అన్నది గీతా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం.
అసలే బన్నీ తో దిల్ రాజు సినిమా కష్టం అని టాక్ ఇప్పటికే వుంది. ఇప్పుడు ఈ ఉదంతంతో అక్కడ కూడా డోర్స్ క్లోజ్ అయిపోతాయని తెలుస్తోంది.
మొత్తానికి ఈ టోటల్ ఉదంతంలో తేలిన సంగతి ఏమిటంటే…మీడియాకు లీకులు ఇచ్చి, మీడియాను వాడుకుని, మీడియాను కలవకుండానే అల్లు అరవింద్ తన పని చక్కబెట్టుకున్నారు..దట్సిట్.