రానున్న ఎన్నికల్లో గెలుపు భారాన్ని వాలంటీర్లపై వైసీపీ వేస్తోంది. అంతా వాలంటీర్ల చేతల్లోనే వుందని వైసీపీ ప్రజాప్రతినిధులు పదేపదే చెప్పడాన్ని చూస్తే, అధికార పార్టీ వారిపై ఎంతగా ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. అది మంచికా? చెడుకా? అనేది 2024 ఎన్నికల ఫలితాలు తేలుస్తాయి. సచివాలయ ఉద్యోగులతో పాటు రూ.5 వేల గౌరవ వేతనంపై సేవలందించే వాలంటీర్ల జగన్ ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ వ్యవస్థ ద్వారా స్వామి కార్యం, స్వకార్యం చేసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా అధికారిక కార్యక్రమాలు ప్రతి ఒక్కటీ జనానికి చేరువయ్యాయి. ఇందులో భాగంగా వైసీపీ అధినేతగా జగన్ పేరును పదేపదే ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల విజయవంతమయ్యారు. ఇదే సందర్భంలో పార్టీకి గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు దూరమయ్యారనే వాదన లేకపోలేదు.
జగన్ ప్రభుత్వం సంక్షేమ పాలనకు ప్రతీకగా నిలిచింది. సంక్షేమ పాలనే తిరిగి తనను అధికారంలోకి తెస్తుందనే నమ్మకం, విశ్వాసం సీఎం జగన్‌ది. ప్రతి కుటుంబానికి లక్షలాది రూపాయల లబ్ధి కలగడానికి కర్త, కర్మ, క్రియ ఎవరంటే… జగనే అని వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల మనసుల్లో నాటుకుపోయేలా వాలంటీర్లు చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఇది మరింతగా పెరుగుతుంది. భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనం కలిగించిన వైఎస్ జగన్‌ను కాకుండా మరొకరి గురించి లబ్ధిదారులు ఆలోచించని విధంగా ప్రజానీకాన్ని వాలంటీర్లు మానసికంగా వైసీపీ వైపు టర్న్ చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.
ఈ ధోరణే ప్రతిపక్షాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరైతే జగన్ పాలనను విమర్శిస్తున్నారో, వారు ఎన్నికల్లో ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపరనే ప్రచారం జరుగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో తమకు ఓటు వేయించే సైన్యంగా వాలంటీర్లను వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు భావిస్తున్నారు. తమకు అనుకూలంగా జనాన్ని పోలింగ్ కేంద్రానికి చట్టబద్ధంగా తీసుకొచ్చేందుకు జగన్ సృష్టించిందే సచివాలయ వ్యవస్థ.
వాలంటీర్లంటే ప్రతిపక్షాలు ఎంతగా భయపడుతున్నాయంటే… వారిని ఎన్నికల విధుల్లో ఉపయోగించకూడదని ఫిర్యాదు చేసేంత. ప్రతిపక్షాలు కోరుకున్నట్టే వాలంటీర్లను ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల వైసీపీ పని మరింత సులువైంది. పోలింగ్ కేంద్రానికి వెలుపల వుంటూ… ఓటర్లను తరలిస్తూ వైసీపీకి అధికారికంగానే పని చేయడానికి వెసలుబాటు కల్పించినట్టైంది. మరోవైపు గ్రామ, పట్టణ, నగరాల్లో అన్నీ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులే చూసుకుంటుంటే… ఇక తమ దగ్గరికి వచ్చే వాళ్లు లేరని, నాయకులకు విలువే లేకుండా తమ నాయకుడు జగన్ చేశారని వాపోవడం గురించి తెలిసిందే.
కొత్త వ్యవస్థ పురుడు పోసుకునే సందర్భంలో ఇలాంటివన్నీ సర్వసాధారణం. అయితే ఎన్నికల సమరంలో ప్రత్యర్థులు దూకుడుగా వెళుతుంటే, తాము మాత్రం చేతులు కట్టుకుని భీష్మించుకుని వుండరని జగన్ వ్యూహం. ఎన్నికల సమయానికి తన కోసం అన్ని స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలు పని చేస్తారని జగన్ నమ్ముతున్నారు. అంతిమంగా అధికారమే లక్ష్యం అయినప్పుడు, ఎవరి విధులు వారు నిర్వర్తిస్తే సమస్య ఏంటనేది ఆయన ప్రశ్న. మరోవైపు వాలంటీర్లపై ప్రతిపక్షాల హెచ్చరికలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
వాలంటీర్లకు అధికార పక్షం గట్టి మద్దతుదారుగా నిలుస్తోంది. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్టమొదటగా తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అని ధర్మాన హెచ్చరించడం గమనార్హం. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సింది వాలంటీర్లే అన్నారు. వాలంటీర్లు తెలివైన వాళ్లు కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరడం విశేషం. వాలంటీర్లపై అధికార పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుందని మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చెబుతున్నాయి. మరి ఎన్నికల్లో ఎంత వరకూ వైసీపీ ఆశల్ని వాలంటీర్లు నెరవేరుస్తారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.
సొదుం రమణ