జనసేన ఓ చిత్రవిచిత్రమైన పార్టీ. ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు లేని ఆత్మ విశ్వాసం, ఆయన కేడర్‌లో కనిపిస్తూ వుంటుంది. పవన్‌ను సీఎంగా చూసుకోవాలని జనసేన నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. కానీ పవన్‌కు మాత్రం సీఎం సీట్లో కూచోవడం కంటే, ప్రస్తుతం ఆ సీట్లో ఉన్న జగన్‌ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యమైంది. ఇందుకోసమే పొత్తులు పెట్టుకుంటానని ఆయన తరచూ అంటుంటారు.
తాజాగా జనసేన సోషల్ మీడియా వైసీపీపై ఓ ప్రచారాన్ని మొదలు పెట్టింది. పలు జాతీయ సర్వేలు మరోసారి ఏపీలో వైసీపీదే ప్రభంజనం అని ప్రకటించడాన్ని జనసేన జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా మళ్లీ వైసీపీదే అధికారం అని తేల్చి చెప్పింది. దీన్ని తిప్పి కొట్టేందుకు జనసేన తన సినిమా ట్రిక్స్‌ను ప్రయోగిస్తూ… ఓ కార్టూన్‌ను తెరపైకి తెచ్చింది.
మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయం అంటూ టైమ్స్ నౌ సర్వేతో కూడిన కార్టూన్‌ను చిత్రీకరించారు. వైసీపీ మంత్రులతో కొందరు …మనమెంత ఊదరగొట్టినా ఇదంతా ఫేక్ సర్వే అని జనం నమ్మట్లేద్సార్!! అంటూ చెబుతున్నట్టుగా ఉంది. అలాగే మరో కామెడీ కామెంట్‌ను కూడా ఇందులో చూడొచ్చు. అదేంటంటే…
“ప్రజలు జగన్‌ను తిరస్కరించి పవన్‌కల్యాణ్ గారి సభలకు బ్రహ్మరథం పడుతుంటే వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అంటూ సర్వేలు చేయించుకుంటున్న వైసీపీ!”
పవన్‌కల్యాణ్‌కు బ్రహ్మరథం పడుతున్నారని జనసేన నమ్ముతుంటే, మరి పొత్తుల కోసం టీడీపీ వెంట పడటం ఎందుకో జనసేనాని చెప్పాలనే నిలదీతలు ఎదురవుతున్నాయి. పవన్‌కు బ్రహ్మరథమా… అబ్బా నిజమా అని కొందరు వెటకరిస్తున్నారు. జగన్‌పై ట్రోలింగ్ చేస్తూ… జనసేన నేతలు మానసికంగా తృప్తి పడుతున్నారని నెటిజన్లు అంటున్నారు. పవన్‌కు బ్రహ్మరథం సంగతేమో గానీ, ఆయన మాత్రం చంద్రబాబు పల్లకీ మోయడానికి ఏ క్షణాన్నైనా సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారని నెటిజన్లు చీవాట్లు పెట్టడం విశేషం.