జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ కష్టాలు ప్రత్యర్థులకు కూడా రావద్దనే సానుభూతి కామెంట్స్ వినిపిస్తున్నాయి. విశాఖలో వారాహి యాత్ర ముగింపు సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేలా పొత్తులుంటాయన్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి వెళ్లడమా? లేదా టీడీపీతో పొత్తు పెట్టుకోవడమా? అనే విషయమై తమ మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు.
పవన్ కామెంట్స్‌పై టీడీపీ, బీజేపీ నోరు తెరిచిన పాపాన పోలేదు. దీంతో పవన్ కామెంట్స్‌ను ఆ రెండు పార్టీలు అసలు పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ తనకు తానుగా పొత్తులపై మాట్లాడుతున్నా, టీడీపీ, బీజేపీ మాత్రం మౌనం పాటించడం వెనుక వ్యూహం ఏమై వుంటుందో అర్థం కావడం లేదని జనసేన నాయకులు అంటున్నారు. బీజేపీ మాత్రం అప్పుడప్పుడు తమకు జనసేనతో పొత్తు వుందని చెబుతుంటారు.
అదేంటో గానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆ మాట బలంగా చెప్పడం లేదు. ఎన్నికల నాటికి ఎన్డీఏలో ఎవరెవరో వుంటారో ఆ రోజు మాత్రమే చెప్పగలమని సెలవిచ్చారు. జనసేనతో పొత్తుపై టీడీపీ తర్జనభర్జన పడుతోంది. జనసేనకు ఆ పార్టీ గరిష్టంగా 20 లేదా 22 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు మాత్రమే ఇవ్వాలని ఆలోచనలో వుంది. అంతకంటే ఎక్కువ సీట్లు జనసేనకు కట్టబెట్టడం అంటే, వైసీపీకి మరోసారి చేజేతులా అధికారం ఇవ్వడమే అనే అభిప్రాయంలో టీడీపీ నేతలున్నారు.
ఎలాగైనా ఈ దఫా అసెంబ్లీలో అడుగు పెట్టడమే లక్ష్యంగా పవన్‌కల్యాణ్ పెట్టుకున్నారు. ఒంటరిగా వెళితే జగన్ ఓడిస్తారని ఆయన భయంతో వణికిపోతున్నారు. పొత్తులపై స్పష్టత వచ్చిన తర్వాతే తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో ప్రకటించాలని పవన్ ఉన్నట్టు సమాచారం. టీడీపీతో కలిస్తేనే తన గెలుపు ఖాయమని ఆయన అనుకుంటున్నారు. లేదంటే మరోసారి 2019లో మాదిరిగా వ్యక్తిగతంగా ఓటమి తప్పదని పవన్ భయంగా వున్నారని తెలిసింది.
టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోయినా, పొత్తులపై పవన్ మాట్లాడుతుండడం వల్ల వారికి చులకన అయ్యారని జనసేన నేతలు వాపోతున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పొలిటికల్ స్టాండ్ ఏంటో నోరు తెరవకపోవడం వెనుక వ్యూహం ఏంటనేది అర్థం కావడం లేదని జనసేన నేతలు అంటున్నారు. పవన్‌ను, ఆయన్ను నమ్ముకున్న తమను టీడీపీ ఏం చేస్తుందోనన్న ఆందోళన జనసేన నేతల్లో కనిపిస్తోంది.