ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉనికిని టీడీపీ అసలు జీర్ణించుకోలేకపోతోంది. సీఎం జగన్ పేరు వినడానికి కూడా టీడీపీ ఇష్టపడడం లేదు. చివరికి జగన్ తన పార్టీకి చెందిన నాయకుడి ఇంటికెళ్లడాన్ని కూడా అనుమానించే పరిస్థితికి టీడీపీ నేతలు దిగజారారు. మరోసారి జగనే సీఎం అయితే టీడీపీ నేతల మానసిక పరిస్థితిని అంచనా వేయడం కష్టమే. తాజాగా సీఎం వైఎస్ జగన్‌పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపణలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
శుక్రవారం వైఎస్ జగన్ ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్ ఆహ్వానం మేరకు షెడ్యూల్‌లో లేకపోయినా వైఎస్ జగన్ ఆయన ఇంటికెళ్లారు. అవినాష్ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. తానున్నాననే భరోసా యువ నాయకుడికి కల్పించారు. అవినాష్‌కు జగన్ రాక ఆయన ప్రాధాన్యాన్ని అమాంతం పెంచినట్టైంది. దీన్ని టీడీపీ నేతలు భరించలేకపోతున్నారు.
టీడీపీ తన మార్క్ కుట్ర రాజకీయానికి తెరలేపిందని వైసీపీ విమర్శలు చేస్తోంది. లోకేశ్ పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ బహిరంగ సభలో అలజడి సృష్టించేందుకే అవినాష్ ఇంట్లో సీఎం జగన్ సమావేశమయ్యారని బుద్దా వెంకన్న ఆరోపణలు, ఆ పార్టీ నాయకుల భావదారిద్ర్యానికి నిదర్శమని ప్రత్యర్థులు మండిపడుతున్నారు. అవినాష్‌ని బలి పశువుని చేసేందుకే జగన్ ఉన్నారని మొసలి కన్నీరు కార్చడం గమనార్హం. వైసీపీ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని టీడీపీ నేత హెచ్చరించారు.
లోకేశ్ పాదయాత్రకు జనం రప్పించేందుకు టీడీపీ రెచ్చగొట్టే కామెంట్స్‌కు తెరలేపిందని బుద్దా వ్యాఖ్యలతో అర్థమవుతోందనే చర్చకు తెరలేచింది. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేసుకునేందుకు టీడీపీ కుట్ర వ్యూహాన్ని పన్నిందని చెప్పొచ్చు.