కోవిడ్ తరువాత ఓటిటి రైట్స్ రూపంలో మంచి ఆదాయం కళ్లబడడం, జాతిరత్నాలు, డిజె టిల్లు లాంటి చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు పెద్ద హిట్ లు కావడంతో దాదాపు అన్ని పెద్ద బ్యానర్లు అన్నీ చిన్న సినిమాల బాట పట్టాయి. అయితే అతి త్వరలోనే సీన్ మారిపోయింది. తత్వం బొధపడింది.
పెద్ద బ్యానర్లు గీతా, మైత్రీ, స్వప్న సినిమాస్, సితార, స్వప్న సినిమాస్ ఇలా చాలా మంది తీసిన చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అదృష్టం కొద్దీ పెద్ద బ్యానర్లు కనుక నాన్ థియేటర్ ఆదాయం బాగానే సంపాదించి గట్టెక్కేసాయి. ఇప్పుడు ఓటిటి సంస్థలు కూడా ఆచి తూచి కొనడం ప్రారంభించాయి. దాంతో చిన్న సినిమాలు నిర్మించాలన్న పెద్ద బ్యానర్లు పునరాలోచనలో పడ్డాయి.
ఇలాంటి నేపథ్యంలో ఓ పెద్ద బ్యానర్ ఇక చిన్న సినిమాలకు స్వస్తి చెప్పాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది పెద్ద బ్యానర్ దానికి అనుబంధంగా చిన్న బ్యానర్ పెట్టి, వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఇకపై జనాల అభిరుచికి అనుగుణంగా ఓ రేంజ్ సినిమాలు మాత్రమే ప్లాన్ చేయాలని, ముఖ్యంగా చిన్న సినిమాలు వదిలేయాలని డిసైడ్ అయ్యారట. చేతిలో బోలెడు సినిమాలు వున్నాయి. కానీ విడుదల డేట్ లు సెట్ కావడం లేదు.
అందువల్ల వున్నవి అన్నీ ఫినిష్ చేసి, ఆ తరువాత ఓ రేంజ్ సినిమాలు మాత్రమే చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పెద్ద సినిమా ఒకటి పెట్టుకుని, చిన్న సినిమాలు అన్నీ గంపగుత్తగా థియేటర్, నాన్ థియేటర్ మార్కెట్ చేసేయడం అన్న వ్యూహం ఇప్పుడు పాతదైపోయింది. అందువల్ల చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు అన్నది రిస్క్ గా మారుతోంది. అందుకే ఈ నిర్థయం తీసుకున్నట్లు తెలుస్తోంది.