వైసీపీ వర్సెస్ జనసేనగా మాటల తూటాలు పేలుతున్న నేపధ్యంలో మంత్రి అంబటి రాంబాబు జనసేనాని పవన్ మాటలకు ట్వీట్లకు ట్విట్టర్ ద్వారానే ఈ మధ్య బదులిచ్చారు. వైసీపీ సర్కార్ కూలుతుంది అంటే కూలడానికి ఇది సినిమా సెట్టింగ్ కదబ్బా అంటూ గట్టిగానే ఇచ్చుకున్నారు. అంతే కాదు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఇదని, కూల్చడం అంటే తమాషా కాదని కూడా అంబటి కౌంటరేశారు.
దానికి జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా బదులిస్తూ ఎంత ప్రజలెన్నుకున్నా కూడా ప్రజాస్వామ్యయుతంగా నడవకపోతే ప్రభుత్వం ఆర్టికల్ 365 ప్రకారం కేంద్రమే ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నియత్రించవచ్చు అని సెలవిచ్చారు. అంటే దీని భావవేమి సైనికా అంటే ఏపీలో రాష్ట్రపతి రూల్ పెట్టి అయినా జగన్ సర్కార్ ని కూల్చమని చెబుతున్నారనే అనుకోవాలి. అంటే ఏపీలో జగన్ పాలన అంతలా తీవ్రవ్యతిరేకతతో ఉన్నారని అంటున్నారు.
అలా అనుకున్నా చీటికీ మాటికీ 365 ఆర్టికల్ ప్రయోగించి ప్రజా ప్రభుత్వాలను కూల్చే హక్కు కేంద్రానికి కూడా లేదని సైనికులు ఎపుడు తెలుసుకుంటారో అని వైసీపీ నేతలు అంటున్నారు. తాము గెలవలేదనో నచ్చలేదనో ప్రభుత్వాలను కూల్చుకుంటూ పోవడానికి అన్ని సార్లూ అన్ని వేళలా కుదదు బాస్ అని సైనికులకు గట్టిగానే చెబుతున్నారు.
అంటే ఇక్కడ అర్ధమవుతున్న విషయం ఏంటి అంటే నిన్నటి టీడీపీ పాటే నేటి జనసేన పాట అన్న మాట. వారూ వీరూ ఎవరైనా కానీ అంతా కలసి ఏపీలో వైసీపీ సర్కార్ ని కూల్చడానికే రాష్ట్రపతిపాలన తీసుకురావడానికే చూస్తున్నారా అన్న డౌట్లను వైసీపీ వారు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూల్చడం మాత్రం గొప్ప ప్రజాస్వామ్యం అవుతుందని అనుకుంటున్నారేమో.