మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీకొట్టడంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎప్పుడో చేతులెత్తేసింది. కొడాలికి వ్యతిరేకంగా చిన్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా టీడీపీకి దమ్ము లేదు. కానీ కొడాలి నానిని ఓ కూన ఢీకొట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఏకంగా కొడాలి ఇంటి ముట్టడికి జనసేన శ్రేణులు ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీరికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఏపీలో రోడ్ల అధ్వాన పరిస్థితిపై జనసేన ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుడివాడలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలంటూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి ముట్టడికి జనసేన శ్రేణులు వెళ్లాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా సాహసించని రీతిలో జనసేన కొడాలి ఇంటి ముట్టడికి వెళ్లడం చర్చనీయాంశమైంది.
జనసేన శ్రేణులు వెళ్లడంతో కొడాలి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొడాలి ఇంటికెళ్లే రహదారిలో గుంతలమయమైన చోట జనసేన ధర్నాకు దిగింది.
మొద్దు నిద్రపోతున్న సీఎం మేలుకోవాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని జనసేన నాయకులు, కార్యకర్తలు నినదించారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు నేర్పడం మాని గుడివాడ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కొడాలికి జనసేన నేతలు హితవు పలకడం విశేషం. ఏది ఏమైనా కొడాలి నాని ఇంటి ముట్టడికి వెళ్లిన జనసేన కార్యకర్తలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.