ఎన్నికల్లో గెలవడానికి మద్దతు కోరామని, గెలిచిన తర్వాత నెత్తినెక్కించుకోవాలంటే ఎలా?… ఇదీ జనసేన ప్రశ్న. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఘన విజయాన్ని దక్కించుకున్నాయి. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్‌కల్యాణ్ కొన్నేళ్లుగా ఏకైక లక్ష్యంతో పనిచేశారు. అందుకే సీట్ల విషయంలోనూ పవన్‌కల్యాణ్ ఒక మెట్టు దిగారు. ఎక్కువ, తక్కువ అనే ఆలోచన లేకుండా, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఏకైక లక్ష్యంతో పవన్ పని చేసి సత్ఫలితాల్ని సాధించారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అప్పుడే క్షేత్రస్థాయిలో ముఖ్యంగా టీడీపీ, జనసేన నాయకుల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో తమకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీడీపీ నాయకులు లబోదిబోమంటున్నారు. తాము చెబితే తప్ప, ఏ అధికారి టీడీపీ నాయకుల మాటల్ని పట్టించుకోనవసరం లేదని జనసేన ప్రజాప్రతినిధులు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నాయకులతో సమీక్ష సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాలకు తమను పిలవలేదని అప్పుడే టీడీపీ నాయకుల నుంచి ఆరోపణలు మొదలయ్యాయి. ఇదంతా ప్రభుత్వం ఏర్పడి కేవలం 10 రోజుల్లోపే కావడం గమనార్హం.
తాజాగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పిఠాపురం నియోజకవర్గ అధికారులతో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పవన్‌కల్యాణ్‌కు స్వయాన అన్న, అలాగే ఆ పార్టీలో నంబర్ టు అయిన నాగబాబును అధికారులు కలవడం విశేషం. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ నాయకులెవరూ అక్కడికి వెళ్లకపోవడం గమనార్హం. వారికి ఆహ్వానం లేదని సమాచారం. అలాగే పిఠాపురంలో ఎలాంటి నిర్ణయాలైనా జనసేన ఇన్‌చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌ను మాత్రమే అడిగి తీసుకోవాలని అధికారులకు నాగబాబు సూచించడం చర్చనీయాంశమైంది.
సహజంగానే నాగబాబు ధోరణి టీడీపీ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తోంది. పవన్ గెలిచినా, అధికారం తన చేతల్లోనే వుంటుందని, అంతా తానే చూసుకుంటానని టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మొదలు ప్రతిదీ వర్మ అనుకున్నదానికి, జరుగుతున్నదానికి పొంతన వుండడం లేదు. వర్మపై జనసేనలోని ఒక వర్గం ఏకంగా దాడికి పాల్పడింది. ఇప్పుడేమో వర్మకు తెలియకుండా నాగబాబు, ఇతర నాయకులు తమ పని తాము చేసుకుపోతున్నారు.
వర్మ, ఇతర టీడీపీ నాయకుల దగ్గరికి అధికారులు వెళ్లే పనిలేదు. ఇదే రాజకీయ వాతావరణం మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. ఏ ప్రజాప్రతినిధి అయినా తాను గెలిచిన తర్వాత, ఇతర పార్టీల నాయకుల్ని చంకలో పెట్టుకుని తిరిగే పరిస్థితి వుండదు. ఇది రాజకీయ లక్షణం. తప్పు పట్టాల్సిన పనిలేదు. అధికారాన్ని తాము శాసించాలని అనుకుంటారే తప్ప, దాన్ని పది మందికి పంచాలని ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ అనుకోరు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఇందులో ఎవర్నీ తప్పు పట్టాల్సిన పనిలేదు. రాజకీయం అలా సాగిపోతూ వుంటుంది మరి!