కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 రోజులైంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల హనీమూన్ హ్యాపీగా సాగుతోంది. మరోవైపు టీడీపీ నాయకులు తమ అక్కసు తీర్చుకుంటున్నారు. గతంలో అతి చేసిన వైసీపీ నాయకులను వేటాడుతున్నారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రజల నుంచి మార్కులు వేయించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత హుందగా వ్యవహరిస్తున్నారనే పేరు పవన్ తెచ్చుకున్నారు.
ప్రస్తుతానికైతే చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ మధ్య దృఢమైన బంధం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే రాజకీయాల్లో పైకి కనిపించేవేవీ నిజం కాదు. కనిపించనవి అబద్దాలు కావు. ఎలాంటి అనుమానాలు, విభేదాలకు ఆస్కారం లేకుండా వీళ్లిద్దరి బంధం కొనసాగినంత కాలం కూటమి పాలన విజయవంతంగా సాగుతుంది. శుభమా అని కూటమి కొత్త సంసారం మొదలు పెట్టిన సందర్భంలో అపశకునాలు పలకాల్సిన అవసరం లేదు. అయితే అధికారంలో మూడు పార్టీల భాగస్వామ్యం వుండడంతో ఎప్పుడు ఏమవుతుందో అనే చర్చ మాత్రం లేకపోలేదు.
జాతీయ రాజకీయాలు కూడా కూటమిపై తప్పక ప్రభావం చూపుతాయి. జాతీయ స్థాయిలో మోదీ సర్కార్ సొంత బలంపై ఏర్పాటు కాలేదనే సంగతి గుర్తించుకోవాలి. జనసేన, బీజేపీ ఒక టీమ్‌గా చూడాల్సి వుంటుంది. ప్రస్తుతానికి మోదీకి చంద్రబాబు నమ్మకస్తుడైన భాగస్వామి. భవిష్యత్‌లో కూడా ఇదే రకంగా వుంటుందా? అంటే చెప్పలేం. రాజకీయాలంటేనే రాత్రికి రాత్రే నిర్ణయాలు మారిపోతూ వుంటాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ సర్కార్ గద్దె దిగిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై పవన్‌కల్యాణ్, అలాగే బీజేపీ నేతలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. వైసీపీ ఓటమి అనంతరం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ తమకు ప్రజలు అధికారం ఇచ్చింది… జగన్‌పై కక్ష తీర్చుకోడానికి కాదన్నారు. అలాగే హామీల్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై వుందని ఆయన పదేపదే గుర్తు చేశారు. పవన్ తీరును వైసీపీ నేతలు సైతం ప్రశంసించారు.
వైసీపీ, అలాగే పరిపాలనపరమైన అంశాల్లో చంద్రబాబు, పవన్ ధోరణులు వేర్వేరుగా ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగని ఇద్దరూ ఇప్పటికిప్పుడు విభేదించుకుంటారని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం తాను మంచి వాడిగా, అందరి వాడిగా అనిపించుకోడానికే ప్రయత్నిస్తారు. భవిష్యత్‌లో చంద్రబాబు, అలాగే టీడీపీ నేతల వైఖరికి నిరసనగా కూటమి నుంచి బీజేపీతో సహా బయటికి రావడానికి ఇప్పటి నుంచి ఒక్కో తప్పును పవన్ లెక్కిస్తుంటారనే చర్చ మొదలైంది.
వైసీపీ, టీడీపీ కేవలం విధ్వంస, ప్రతీకార, కక్షపూరిత రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చాయని, తాము భిన్నంగా వుంటామని చెప్పుకోడానికి పవన్ ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. బీజేపీతో కలిసి భవిష్యత్‌లో మూడో ప్రత్యామ్నాయ కూటమిగా పవన్ కల్యాణ్ అవతరించేందుకు తగిన రాజకీయ ఏర్పాట్లు చేసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవేవీ కంటికి కనిపించవు. హుందాగా వ్యవహరించడం ద్వారా, ప్రజల దృష్టిలో ఇలాంటి వాడు పాలకుడు కావాలనే ఆలోచన రగిలించాలనే వ్యూహం పవన్‌లో కనిపిస్తోందనే మాట వినిపిస్తోంది.
అసెంబ్లీలో తనతో పాటు జనసేన అభ్యర్థులంతా అడుగు పెట్టాలన్న పవన్ ఆలోచన విజయవంతమైంది. దీంతోనే ఆయన సంతృప్తి చెందరు. జనసేన శ్రేణులు కూడా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ను సరిపెట్టుకున్నారు. భవిష్యత్‌లో సహజంగానే ముఖ్యమంత్రిగా పవన్‌ను చూడాలని అనుకుంటారు. ఈ ఎన్నికల్లో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలుగా గెలవడం పవన్‌లో ధైర్యాన్ని నింపింది. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు ఆయనలో ఎలాంటి ఆలోచన కలిగిస్తాయో ఇప్పుడే చెప్పలేం.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనేది పవన్ అభిప్రాయం. కానీ చంద్రబాబు మాత్రం ప్రస్తుతానికి సంక్షేమ పథకాల ఊసే ఎత్తడం లేదు. పింఛన్ల పెంపు ఫైల్‌పై మాత్రం సంతకం చేశారు. ఇక మిగిలిన హామీలపై చంద్రబాబు సర్కార్ నిర్ణయాలు, పవన్ అడుగులు ఆధారపడి వుంటాయి. అలాగే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ పరిణామాలు కూడా పవన్ ఆలోచనలపై ప్రభావం చూపనున్నాయి.
ఒక్కటి మాత్రం నిజం… ప్రజలను మోసగించడానికి పవన్ ససేమిరా అంగీకరించరని జనసేన కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు. తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తోందనే అభిప్రాయం పవన్‌లో కలిగితే మాత్రం… ఆయన ఒక్క క్షణం కూడా కూటమిలో కొనసాగరని వారు చెబుతున్నారు. అందుకే హనీమూన్ తర్వాత కూటమిలో చోటు చేసుకునే పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకుంది.