ఉమ్మడి విశాఖ జిల్లాలోని కీలక నియోజకవర్గం చోడవరం సీటుని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. పొత్తులో భాగంగా తమకు దక్కుతుందని జనసేన వర్గాలు ఆశించాయి. ఆ పార్టీ తరఫున ఆశలు పెట్టుకుని పనిచేశారు నియోజకవర్గం ఇంచార్జి పీవీఎస్ఎన్ రాజు.
ఇపుడు ఆ సీటు దక్కకుండా పోయింది. దాంతో మీడియా ముందుకు వచ్చిన ఆయన వైసీపీని ఓడించాలంటే జనసేనకే చోడవరం సీటు ఇవ్వాలని కోరుతున్నారు. జనసేన గడచిన అయిదేళ్ళుగా నియోజకవర్గంలో చురుకుగా పనిచేసింది అని ఆయన అంటున్నారు. తనకు పదవీ వ్యామోహం లేదు అంటూనే సీటు జనసేనకు ఇచ్చే విషయం పునరాలోచించాలని చంద్రబాబు పవన్ కి సూచించారు.
తాము నియోజకవర్గం సమస్యల మీద పోరాడాను అని ఆయన అంటున్నారు. తనకు సీటు ఇస్తే పార్టీలకు అతీతంగా అంతా మద్దతు ఇస్తారని ఆయన చెబుతున్నారు. వైసీపీని ఓడించడం ప్రధానం అయినపుడు జనసేనకే సీటు ఇవ్వాలని ఆయన కోరడం విశేషం. టీడీపీ తరఫున రెండు సార్లు గెలిచిన రాజుకు పార్టీ ఈసారి టికెట్ ఇచ్చింది.
అయితే జనసేన నేత మాటలను బట్టి చూస్తే ఆయన వైసీపీని ఓడించలేరని అర్ధమా అని అంటున్నారు. జనసేన టీడీపీని గెలిపించాలంటే నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని జనసేన నేతలు కోరుతున్నారు. టీడీపీ ఎన్నికల్లో అదే చెబుతుంది కదా ప్రత్యేకించి భరోసా జనసేనకే ఇవ్వడం ఎందుకు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
ఇక్కడ జనసేన- టీడీపీ పొత్తు సాఫీగా సాగుతుందా ఓట్ల బదిలీ జరుగుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే అనకాపల్లి జనసేన ఇంచార్జి పార్టీకి రాజీనామా చేశారు. చోడవరం ఇంచార్జి పార్టీలోనే ఉంటాను అని చెబుతున్నారు కానీ సీటు విషయం ఆలోచించాలని కోరుతున్నారు. చోడవరం కూటమి విషయం ఎలా సాగుతుందో చూడాలని అంటున్నారు.