జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఉన్నట్టా? లేనట్టా?.. ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య జరుగుతున్న చర్చ ఇదీ. సీట్ల విషయానికి వచ్చే సరికి చంద్రబాబు తమ నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నారని పవన్ గ్రహించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు వుంటుందని తమ నాయకుడు చెబుతున్నారనే విషయాన్ని జనసేన శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ, జనసేన ఒప్పందాలను పక్కన పెట్టి, చంద్రబాబు, పవన్ వేర్వేరుగా జనంలోకి వెళ్లాలని అనుకోవడమే ఆ రెండు పార్టీల మధ్య ఏదో తేడా కొడుతోందనే అనుమాలకు బీజం పడింది. జనసేనాని పవన్‌కల్యాణ్ నిబద్ధత, స్థిరత్వం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే మంచిది. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు అగ్ని సాక్షిగా పెళ్లాడిన వారితోనే ఆయన ఎక్కువ కాలం కలిసి ఉండరు. అలాంటిది ఇతర రాజకీయ పార్టీలతో కొనసాగుతారనుకోవడం అవివేకమే.
పవన్‌కల్యాణ్ వచ్చే నెల నుంచి జనంలోకి వెళ్తారని, ఒక్కో రోజు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటారని ఇటీవల ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు విషయానికి వస్తే…. ఈ నెల 27 నుంచి తిరిగి రా… కదిలిరా సభల్లో పాల్గొనడానికి షెడ్యూల్ రూపొందించారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన వుంటుంది. ఒక్కో రోజు రెండు సభల్లో ఆయన పాల్గొననున్నారు.
27న అన్నమయ్య జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండ, 28న నెల్లూరు రూరల్, పత్తికొండ, 29న రాజమహేంద్రవరం జిల్లాలోని రాజమండ్రి రూరల్, గుంటూరు జిల్లాలోని పొన్నూరు సభల్లో బాబు పాల్గొంటారని టీడీపీ వివరాలు వెల్లడించింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిసి కొన్ని సభల్లో పాల్గొంటారని ఆ రెండు పార్టీలు ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నియోజక వర్గాల్లో టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాలు జరుగుతాయని కూడా వెల్లడించారు.
సమన్వయ సమావేశాలు కాస్త రభస సమావేశాలుగా మారడంతో నిర్వహించడం మానుకున్నారు. మరోవైపు సీట్లకు సంబంధించి కొలిక్కి రాకపోవడం, సయోధ్య కుదరడం లేదని, ఎవరికి వారుగా ఒంటరిగా వెళ్లేందుకు వ్యూహ రచనలో ఉన్నారనే చర్చకు తెర లేచింది. ఈ ప్రచారానికి బలం కలిగించేలా చంద్రబాబు, పవన్ వేర్వేరుగా సభల్లో పాల్గొననున్నారు. ఏమవుతుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.