జయహో ఇండియన్ సినిమా

కరోనా తర్వాత సర్వనాశనం అన్నారు. ఓటీటీ విరుచుకుపడ్డంతో సినిమా రంగం అంతరించిపోతుందన్నారు. ఈ కాలం థియేటర్లకు ఎవడొస్తాడంటూ ఎద్దేవా చేశారు. కానీ అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ భారతీయ చిత్ర పరిశ్రమ గణనీయమైన వృద్ధిని…

కరోనా తర్వాత సర్వనాశనం అన్నారు. ఓటీటీ విరుచుకుపడ్డంతో సినిమా రంగం అంతరించిపోతుందన్నారు. ఈ కాలం థియేటర్లకు ఎవడొస్తాడంటూ ఎద్దేవా చేశారు. కానీ అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ భారతీయ చిత్ర పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఎంతలా అంటే కరోనా తర్వాత ఏకంగా 224 శాతం వృద్ధి నమోదైంది.

2023లో భారతీయ చిత్ర పరిశ్రమ 12వేల కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ సాధించింది. కరోనా తర్వాత 2021లో ఇండియన్ సినిమా కేవలం 3772 కోట్ల రూపాయలు ఆర్జించింది. దాంతో పోల్చి చూస్తే.. ఈ రెండేళ్లలో 224 శాతం వృద్ధిని నమోదు చేసింది చిత్ర పరిశ్రమ.

ఆ 10 సినిమాలదే 44 శాతం వాటా… 2023లో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూవీస్ అన్నీ కలిపి 12వేల కోట్ల రూపాయల గ్రాస్ సాధించాయి. అయితే ఇలా రిలీజైన సినిమాల్లో 10 సినిమాల నుంచే 44 శాతం ఆదాయం సమకూరడం విశేషం. మరీ ముఖ్యంగా చితికిపోయిందనుకున్న బాలీవుడ్, 2023లో మెరవడం కొసమెరుపు.

హిందీ మార్కెట్లో విడుదలైన 10 సినిమాల నుంచి రూ. 5380 కోట్లు (44 శాతం) సమకూరింది. 2022లో హిందీ మార్కెట్ భాగం 33 శాతం ఉండగా, ఇప్పుడది 44 శాతానికి పెరిగింది. ఈ టాప్-10 లిస్ట్ లో షారూక్ టాప్ లో ఉన్నాడు. అతడు నటించిన జవాన్ సినిమా నుంచి ఏకంగా రూ. 734 కోట్ల గ్రాస్ వచ్చింది. 

భారత్ లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాల జాబితా ఇది.

1. జవాన్ – రూ. 734 కోట్లు

2. యానిమల్ – రూ. 645 కోట్లు

3. పఠాన్ – రూ. 636 కోట్లు

4. గదర్ 2 – రూ. 619 కోట్లు

5. సలార్ – రూ. 512 కోట్లు

6. జైలర్ – రూ. 408 కోట్లు

7. లియో – రూ. 406 కోట్లు

8. ఆదిపురుష్ – రూ. 325 కోట్లు

9. టైగర్ 3 – రూ. 319 కోట్లు

10. కేరళ స్టోరీ – రూ. 265 కోట్లు

దూసుకుపోతున్న టాలీవుడ్… భారతీయ చిత్రసీమలో సహజంగానే హిందీ మార్కెట్ వాటా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, హిందీ ఆడియన్స్ ఎక్కువ కాబట్టి. ఆ తర్వాత స్థానంలో టాలీవుడ్ నిలిచింది. ఇండియన్ సినిమాలో టాలీవుడ్ వాటా 19 శాతం. టాలీవుడ్ తర్వాత 16 శాతం వాటాతో కోలీవుడ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. మలయాళం 5 శాతం, కన్నడ 3శాతం వాటాలు కలిగి ఉన్నాయి. మిగతా భాషల సినిమాలన్నీ కలిపి 5శాతం వాటా కలిగి ఉన్నాయి. 

మొత్తమ్మీద కరోనా తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ మళ్లీ గాడిన పడిందని చెప్పడానికి 2023 బాక్సాఫీస్ సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ ఏడాది అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో మరిన్ని భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో.. 2023 రికార్డ్ బద్దలవ్వడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.