అపరిమితమైన “పవర్” చేతికొస్తే… జరగరానివన్నీ జరుగుతుంటాయి. గతంలో వైసీపీకి ఇలాగే అపరిమితమైన అధికారం దక్కడంతో ఆ పార్టీ నాయకులకు కళ్లు నెత్తికెక్కి ఇష్టానుసారం ప్రవర్తించారు. ఐదేళ్లు తిరిగేసరికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాదరణ లభించింది. ఏకంగా 164 అసెంబ్లీ సీట్లు కూటమి వశమయ్యాయి.
ఈ నేపథ్యంలో కూటమి నేతలకు భవిష్యత్ అంతా బంగారమయంగా కనిపిస్తోంది. ఇక తమకు తిరుగులేదన్న భావన బలపడింది. ఎన్నికల్లో ప్రత్యర్థి కనుమరుగు కావడంతో, తమలో తామే కలహించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదహరణ పిఠాపురంలో టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన దాడి. కూటమిలో భవిష్యత్ పరిణామాలు ఎలా వుంటాయో వర్మపై దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు గాయపడడంతో పాటు ఆయన కారు ధ్వంసమైంది. దాడికి నిరసనగా వర్మ నేతృత్వంలో ఆందోళనకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్రస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా అధికారికంగా బాధ్యతలు తీసుకోకనే… ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే, భవిష్యత్‌లో టీడీపీ, జనసేన మధ్య వార్ ఎలా వుండనుందో చెప్పకనే చెబుతోందన్న చర్చకు తెరలేచింది.
గొల్లప్రోలు మండలం వన్నెపైడి గ్రామానికి తమకు తెలియకుండా ఎందుకొచ్చావని వర్మను అ గ్రామానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు నిలదీయడం గమనార్హం. తమకు తెలియకుండా తమ గ్రామంలో ఇతర పార్టీల వారిని ఎందుకు కలుస్తున్నారు? అని నిలదీయడంతో వర్మ షాక్‌కు గురయ్యారు.
మీకు చెప్పాల్సిన పనిలేదని వర్మ ఆగ్రహంగా చెప్పడంతో గోడవ జరిగింది. తనను చంపేస్తారనే భయంతో వర్మ అక్కడి నుంచి కారులో పరారు కావాల్సిన దయనీయ స్థితి జనసేన వల్ల ఏర్పడింది. ఇదే విషయాన్ని వర్మ కూడా అన్నారు. అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జనసేన నేతలు తనను చంపడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తొమ్మిది నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని, జనసేనకు పని చేయడం తన ఖర్మ అని ఆయన వాపోవడం గమనార్హం.
ఈ ఘటన చూస్తే… రానున్న కాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన మధ్య ఎలాంటి సంబంధాలుంటాయో అర్థం చేసుకోవచ్చు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినా, అంతా తానే చూసుకుంటానని గతంలో వర్మ ప్రకటించారు. అయితే పిఠాపురంలో నీ పెత్తనం ఏంటని మొదట్లోనే వర్మకు జనసేన అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది. అందుకే తమకు తెలియకుండా పిఠాపురం నియోజక వర్గంలో ఎవర్నీ కలవకూడదు, మాట్లాడకూదని జనసేన వార్నింగ్ ఇచ్చింది. కాస్త ముందుకెళ్లి ఆ పార్టీ వర్మపై దాడికి తెగబడింది. అపారమైన అధికారాన్ని ఇస్తే… ఎక్కడైనా ఇట్లుంటది మరి!