తెలుగుదేశం పార్టీ లో జేసీ ఫ్యామిలీ అసహనంగానే ఉంది. తాము ఉన్న పార్టీలో అసహనంగా ఉండటం జేసీ ఫ్యామిలీకి కొత్త కాదు. కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి కూడా జేసీ సోదరులు అసహనంగా ఉండటం, అసహనాన్ని వ్యక్తం చేయడం మామూలే. కాంగ్రెస్ లోనూ ఆ పార్టీ నేతలతో పడేది కాదు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా సొంత పార్టీ నేతలతో రకరకాల తగాదాలు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినా.. ఆ పార్టీ పాత నేతలతో రచ్చలే కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ జేసీ సోదరులు రకరకాల తగాదాలతో వార్తల్లో నిలిచే వారు.
ఇక ఇప్పుడు కూడా టీడీపీ లోని పలువురు నేతలతో వీరికి పొసగడం లేదు. తమకు చాలా దూరం అయిన పుట్టపర్తి నియోజకవర్గం వ్యవహారంలోనూ వీరు వేలు పెడుతున్నారు. అక్కడ టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథ రెడ్డికి త్రెట్ పెట్టారు జేసీ సోదరులు. రఘునాథ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే అక్కడ టీడీపీ ఓడిపోతుందంటూ జేసీ సోదరులు బాహాటంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ని పుట్టపర్తిలో కూడా కాపాడటం తమ ధ్యేయమని అంటున్నారు. అయితే పల్లె రఘునాథ రెడ్డి మాత్రం ఈ జోక్యాన్ని సహించడం లేదు. జేసీ సోదరుల జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఆయన బాహాటంగా అసంతృప్తిని చాటుతున్నారు.
ఆ సంగతలా ఉంటే… వచ్చే ఎన్నికల్లో జేసీ బాధితులు తెలుగుదేశం పార్టీలో మరింతమంది ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేరు వినిపిస్తూ ఉంది. 2014లో చౌదరి తెలుగుదేశం పార్టీ తరఫున అనంతపురం ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.
అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే… ప్రభాకర్ చౌదరి, జేసీ వర్గాల మధ్యన అస్సలు పడేది కాదు. వీరి రచ్చ అప్పట్లోనే వీధికి ఎక్కింది. ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ప్రభాకర్ చౌదరి ల మధ్యన వీధి పోరు అప్పట్లో మంచి మసాలా అంశంగా వార్తల్లో నిలిచింది. చివరకు ఆ పోరులో ఎవ్వరు నెగ్గారో కానీ.. ఇరు వర్గాలూ ఓటమిని మూటగట్టుకున్నాయి.
జేసీ పవన్ అనంతపురం నుంచి ఎంపీగా ఓడారు. తాడిపత్రిలోనూ ఓటమి తప్పలేదు. అటు ప్రభాకర్ చౌదరి కూడా ఓటమి పాలయ్యారు. ఇక వచ్చే ఎన్నికల సంగతికి వస్తే.. జేసీ ఫ్యామిలీ అనంతపురం ఎమ్మెల్యే టికెట్ రేసులో కూడా ఉంది. చంద్రబాబు కూడా ఈ మేరకు దాదాపు ఓకే చెప్పారని సమాచారం.
అనంతపురం ఎమ్మెల్యేగా జేసీ కుటుంబం నుంచి ఒకరు నిలవవచ్చు. అనంతపురం ఎంపీ సీటును టీడీపీ బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. ఫలితంగా… గత ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేసిన పవన్ వచ్చే సారి అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి కి టికెట్ ప్రశ్నార్థకం అవుతోందని తెలుస్తోంది. అనంతపురం అర్బన్ వదిలితే ప్రభాకర్ చౌదరికి మరో ఆప్షన్ లేనట్టే. దీంతో.. రెడ్డి గారి ఎంట్రీతో చౌదరికి టీడీపీ టికెట్ దక్కకుండా పోతుందా! అనే చర్చ జరుగుతోంది స్థానికంగా.