వచ్చే ఎన్నికల్లో తను మంగళగిరి నుంచినే మళ్లీ పోటీ చేస్తానంటూ తెలుగుదేశం పార్టీ యువరాజు నారా లోకేషుడు ప్రకటించారు చాన్నాళ్ల కిందటే. గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన నియోజకవర్గం అది. అయినప్పటికీ.. పోగొట్టుకున్న చోటే రాబట్టుకునే వ్యూహంతో లోకేష్ వచ్చే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచి పోటీ చేస్తారనే విశ్లేషణలు వినిపించాయి.
మొత్తానికి నారా లోకేష్ లో ఓటమితో నైరాశ్యం కాకుండా, ఉత్సాహం పొంగి పొర్లుతోందని అంతా భావించారు. ఓడిన చోటే గెలిచి ఆయన తలెత్తుకునే ప్రయత్నంలో ఉన్నారని అనుకున్నారు. అయితే మంగళగిరి లో తాజా పరిణామాల నేపథ్యంలో.. లోకేష్ అక్కడ నుంచి పోటీ చేస్తారా? అనే సందేహాలు రేగుతున్నాయి.
మంగళగిరిలో పోటీ గురించి లోకేష్ గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడే అవకాశాలు ఇప్పుడు కనిపించడం లేదు. స్థానికంగా ముఖ్య నేతలంతా తెలుగుదేశం పార్టీని ఒకరి తర్వాత ఒకరుగా వీడుతూ ఉండటం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. స్థానికంగా బలం ఉన్న వాళ్లు తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు. వారు పార్టీని వీడటంతో తెలుగుదేశం పార్టీకి సామాజికవర్గ సమతుల్యత కూడా లభించడం కష్టతరంగా మారింది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే.. లోకేష్ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి బరిలో నిలచే సాహసం చేయకపోవచ్చు!
మరి మంగళగిరిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు హిందూపురంలో రాజకీయ చర్చగా మారుతుండటం గమనార్హం. ఒకవేళ మంగళగిరిలో పోటీ చేయకపోతే లోకేష్ కు తదుపరి గమ్యం హిందూపురం కావొచ్చని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా ఆ పార్టీకి విజయాన్ని ఇచ్చిన నియోజకవర్గం హిందూపురం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం, తెలుగుదేశం పార్టీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఉండటం.. ఈ పరిణామాలు హిందూపురంలో టీడీపీ తరఫున ఎవ్వరు నిలిచినా విజయం సాధించే అవకాశాలను ఇస్తున్నాయి. వీటిని ఆసరాగా చేసుకునే లోకేష్ కు పిల్లనిచ్చిన మామ కమ్ మేనమామ బాలకృష్ణ వరస విజయాలు సాధించారు. ఇలా పార్టీకి పూర్తి సానుకూల నియోజకవర్గం అయిన హిందూపురాన్ని బాలకృష్ణ తన అల్లుడి కోసం త్యాగం చేయాల్సి రావొచ్చని టాక్!
మంగళగిరిలో అంతా సవ్యంగా ఉండి ఉంటే లోకేష్ బరిలోకి దిగే వాడేమో! అక్కడేమో పరిస్థితులు మారిపోయాయి. దీంతో పాత సవాలుకు లోకేష్ కట్టుబడి ఉండే అవకాశాలు కనిపించడం లేదు. సేఫెస్ట్ నియోజకవర్గాన్ని ఎంచుకునే క్రమంలో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు నుంచి లోకేష్ బరిలోకి దిగే ప్రయత్నాలు చేయబోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.