ఐ ఫోన్ లేటెస్ట్ వెర్షన్ విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. చాన్నాళ్లుగా ఐఫోన్ 14 కు సంబంధించి ఊరింపు ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఈ సారి యాపిల్ ఎలాంటి ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటుందనేది చర్చలో నిలుస్తూ వస్తోంది. ఐఫోన్ ప్రేమికులు లేటెస్ట్ వెర్షన్ గురించి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని వారిలో ఎగ్జయిట్ మెంట్ ఉంది. ముందస్తు బుకింగ్స్ కోసం ప్రయత్నాలు, భారీ క్యూ లైన్లు తప్పనిసరిగా ఉండవచ్చు.
ఐఫోన్ 13 లోని మోడల్స్ సూపర్ హిట్ తర్వాత 14 విడుదల అవుతోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ యూజర్లను కట్టిపడేశాయి. కెమెరా క్లారిటీ, డిజిటల్ సిమ్ ఆప్షన్లు.. ఈ మోడల్స్ ను సూపర్ సక్సెస్ చేశాయి. ప్రస్తుతం వీటి ధరలు 70 వేల స్థాయి నుంచి లక్షా నలభై వేల వరకూ ఉన్నాయి. ఐఫోన్ 13 మోడల్ రావడంతోనే 128 జీబీ74 వేల రూపాయల స్థాయితో విడుదలైంది.
అయితే 14 మాత్రం కాస్త తక్కువ ధరతోనే విడుదల కావొచ్చని అంచనా. 128 జీబీ ఐఫోన్ 14 ధర 60 వేల రూపాయల నుంచినే మొదలుకావొచ్చని అంచనా! కొత్త మోడల్ ధర ఈ స్థాయిలో ఉండటం కాస్త ఆశ్చర్యమే. ఈ సారి ఈ మేరకు తగ్గుదల ఖాయమని టెక్ పత్రికలు చెబుతున్నాయి. 14కు సంబంధించి ప్రో, ప్రో మ్యాక్స్ ల ధరలు కూడా 13 ప్రో, ప్రో మ్యాక్స్ ల కన్నా తక్కువే ఉండవచ్చని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరి అదే జరిగితే ఐఫోన్ 13 ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐఫోన్ 11 లభిస్తున్న ధరలోనే ఐఫోన్ 13 వస్తుందని ఇది వరకే చాలా మంది అంచనా వేశారు. 14 విడుదల కాగానే..13 మోడల్ ధర 11 మోడల్ స్థాయికి తగ్గుతుందని అంటున్నారు. ఒకవేళ ఐఫోన్ 14 ధర 60 వేల స్థాయిలోనే మొదలైతే..13 ధర ఉన్నట్టుండి ఏ 40 వేలకో పడిపోయినా పెద్ద ఆశ్చర్యం లేదు!