తాడిపత్రిలో తనయుడిని, అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి అన్న కుమారుడిని గెలిపించుకోలేని నేతలు… రానున్న ఎన్నికల్లో చంద్రబాబును సీఎంగా చూడాలని తహతహలాడుతున్నారు. బాబును సీఎం చేశాకే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఓ మాజీ ఎమ్మెల్యే శపథం చేయడం విశేషం. పల్లె రఘునాథరెడ్డి లాంటి వారికి మళ్లీ టికెట్ ఇస్తే… చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేరని ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి సంచలనానికి తెరలేపారు.
ఇటీవల మంత్రిగా ఉషశ్రీ చరణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కల్యాణదుర్గం వచ్చిన సందర్భంగా అనుచరులు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైద్యానికి దారి అందక ఓ పసిపాప మృతి చెందింది. ఇది రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ సందర్భంగా బాధితుల తరపున ఆందోళనకు దిగిన టీడీపీ నేత ప్రకాశ్నాయుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు.
ప్రకాశ్‌నాయుడిని జేసీ ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. ప్రజాసమస్యలపై పోరాడే వాళ్లపై రౌడీషీటర్ కేసు నమోదు చేస్తే భయపడేది లేదన్నారు. ఉషశ్రీకి సంబంధించి కర్నాటక లోకాయుక్త, సుప్రీంకోర్టులో నమోదైన కేసుల గురించి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. మృతి చెందిన పాప తండ్రి వికలాంగుడని, ఆయనకు పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును సీఎంగా చూసిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటానని జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
ఇప్పటికే జేసీ బ్రదర్స్ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల నుంచి తప్పుకుని తనయులను రంగంలోకి దింపారు. అయినప్పటికీ 2019 ఎన్నికలు వారికి కలిసిరాలేదు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఆయన మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై సంచలనం సృష్టించారు.
రాష్ట్రంలో తాడిపత్రిలో మాత్రమే టీడీపీ జెండా రెపరెపలాడిన సంగతి తెలిసిందే. తాడిపత్రిలో అధికార పార్టీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి కొరకరాని కొయ్యగా మారారు.