తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ పేరు తెలియనివారు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా పని చేసిన జయప్రకాష్ నారాయణ మచ్చలేని అధికారి. ఆయన అభిప్రాయాల్లో స్పష్టత ఉంటుంది. ఏ అంశం మీదనైనా సాధికారికంగా, కూలంకషంగా, వివరంగా మాట్లాడగలరు. సామాన్య జనాల్లో ఆయనకు మేధావిగా పేరుంది. అలాంటి జేపీ వచ్చే ఎన్నికల్లో ఏపీలో బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. అలా అనడంకంటే ఆ విషయాన్ని ఆయనే చెప్పారనడం సమంజసం. ఉమ్మడి రాష్ట్రం కాస్తా ఏపీ, తెలంగాణగా విడిపోయాక ఎటూ మొగ్గకుండా ఉండిపోయిన జయప్రకాష్ నారాయణ్ తిరిగి ఇప్పుడు ఏపీలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
తాజాగా విజయవాడలో ఓ మీటింగ్ పెట్టి పాత లోక్ సత్తా కార్యకర్తలు, నేతల్ని పిలిపించుకుని మాట్లాడిన జేపీ.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో లోక్ సత్తా పోటీ చేయబోతోందని అక్కడి నుంచే ప్రకటించిన జేపీ.. ఇప్పుడు దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు జయప్రకాష్ నారాయణ. ఈయన రాజకీయాలనుంచి విరమించుకున్నారని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇలా సడన్ గా రంగప్రవేశానికి సిద్ధం కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. పొలిటికల్ రీఎంట్రీకి ఆయనే సిద్ధమయ్యారా? ఆయన్ని ఎవరైనా ప్రేరేపించారా? అనేది తెలియాల్సిఉంది. సాధారణంగా ఎన్నికలు దగ్గర పడుతుంటే ఇలా ఎవరో ఒకరు ఎంట్రీ ఇచ్చి ఓట్లు చీలుస్తుంటారు. ఈ పరిస్థితి వల్ల సాధారణంగా అధికార పార్టీ లాభపడుతూ ఉంటుంది.
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం కారణంగా కాంగ్రెస్ లాభపడింది. వైఎస్సార్ సిఎం అయ్యారు. జేపీ పోటీ కారణంగా జగన్ లాభ పడొచ్చని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక జయప్రకాష్ ఏపీలో సుపరిచితమైన పేరు. ఒకప్పుడు డాక్టర్ గా, ఆ తర్వాత ఐఏఎస్ గా, అనంతరం లోక్ సత్తా ఉద్యమ వ్యవస్ధాపకుడిగా, చివరికి లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన జయప్రకాష్ నారాయణ్ కు తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులపై పూర్తి అవగాహన ఉంది. అంతకు మించి ఇక్కడి రాజకీయ నాయకులతో పెనవేసుకున్న బంధం కూడా ఉంది. ఒకప్పుడు సమాచార హక్కు చట్టం కోసం జాతీయ స్ధాయిలో యూపీఏ ప్రభుత్వానికే సలహా ఇచ్చిన ఘనత ఆయనది. ఎన్నికల సంస్కరణలు అమలు చేయించేందుకు లోక్ సత్తా చేసిన ఉద్యమంలో జేపీ సాధించిన విజయాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇవన్నీ ఓ ఎత్తయితే రాజకీయ నేతగా జేపీ ప్రస్ధానం మరో ఎత్తు. కూకట్ పల్లి ఎమ్మెల్యేగా గెలిచినా తనకున్న పరిమితుల్లో జనాన్ని మెప్పించడంలో విఫలమైన జేపీ.. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జేపీ గతంలో చంద్రబాబు మనిషని ఒక ప్రచారం ఉండేది. అది నిజమో కాదో సరిగ్గా చెప్పలేం. ఒకప్పుడు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో లోక్ సత్తా ఎమ్మెల్యేగా జయప్రకాష్ నారాయణ గెలుపు వెనుక ఉన్నది చంద్రబాబేనని చెబుతారు. అప్పట్లో టీడీపీ మద్దతు వల్లే కూకట్ పల్లిలో జేపీ ఎమ్మెల్యేగా గెలిచారన్నవాదన ఉంది.
దీంతో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన జేపీ మరోసారి మాత్రం 2014లో గెలవలేకపోయారు. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ అభిప్రాయంతో జేపీ ఏకీభవిస్తారో లేదో తెలియదు. విపక్ష కూటమితో కలవకుండా నేరుగా లోక్ సత్తా బరిలోకి దిగితే, జేపీ ప్రచారం చేస్తే అది అంతిమంగా వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఉపయోగపడుతుంది. తద్వారా వైఎస్ జగన్ కు మేలు జరిగే అవకాశాలే ఎక్కువ.