జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే ఓడిపోయాన‌నేలా ఉన్నారామె!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిదానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ముడిపెట్ట‌డం ప‌రిపాటైంది. మంచి జ‌రిగితే చంద్ర‌బాబు, చెడైతే జ‌గ‌న్ అని ప్ర‌చారం చేయ‌డంలో ప‌చ్చ బ్యాచ్ దిట్ట‌. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌తో చంద్ర‌బాబు, లోకేశ్ వ‌ద్ద మార్కులు కొట్టేయాల‌ని…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిదానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ముడిపెట్ట‌డం ప‌రిపాటైంది. మంచి జ‌రిగితే చంద్ర‌బాబు, చెడైతే జ‌గ‌న్ అని ప్ర‌చారం చేయ‌డంలో ప‌చ్చ బ్యాచ్ దిట్ట‌. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌తో చంద్ర‌బాబు, లోకేశ్ వ‌ద్ద మార్కులు కొట్టేయాల‌ని టీడీపీ నేత‌లు ఉత్సాహం చూపుతుంటారు. అలాంటి వారిలో తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్య‌క్షురాలు వంగ‌లపూడి అనిత ముందు వ‌రుస‌లో ఉన్నారు.

పాయ‌క‌రావుపేట టికెట్ ఇచ్చే వ‌ర‌కూ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయాల‌నే టాస్క్ అనిత‌కు ఇచ్చిన‌ట్టున్నారు. ఈ క్ర‌మంలో తాను గెల‌వ‌లేక‌పోవ‌డానికి కూడా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌తే కార‌ణ‌మ‌ని అనిత విమ‌ర్శించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. పాయ‌క‌రావుపేట‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు వ‌ద్ద‌న‌డంతో కొవ్వూరు టికెట్‌ను అనిత‌కు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ కూడా ఆమె ఓడిపోయారు. ఇప్పుడామె ప‌రిస్థితి త్రిశంకు స్వ‌ర్గంలో ఉన్న‌ట్టైంది. తాను ఆశిస్తున్న పాయ‌క‌రావుపేట టికెట్ ద‌క్కుతుందో, లేదో ఆమెకే తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి.

ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం జగన్ చేతగానితనం, అసమర్థత ఆడబిడ్డలకు శాపంగా మారిందని అనిత విమర్శించారు.

అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని నమ్మించి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చార‌ని విమ‌ర్శించారు. ఆడబిడ్డల మానానికి రూ. 5 లక్షలు, ప్రాణానికి రూ. 10 లక్షలు ఖరీదు కట్టే దుస్థితి రాష్ట్రంలో నెల‌కుంద‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.  బాబాయ్ హత్యకేసులో చెల్లికే న్యాయం చేయలేని జగన్ రాష్ట్రంలోని మహిళల్ని రక్షిస్తారా? అని ప్రశ్నించారు. కడపలో అనూష అనే విద్యార్థిని పోలీసుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే చ‌నిపోయింద‌ని వాపోయారు. పోస్ట్ మార్టమ్ నివేదిక రాకుండానే  ఆత్మహత్య అని పోలీసులు ఎలా తేల్చుతార‌ని ఆమె నిల‌దీశారు.  

చంద్ర‌బాబు పాల‌న‌పై అడ‌బిడ్డ‌ల న‌మ్మ‌కం ఎందుకు పోయిందో అనిత స‌మాధానం చెబితే బాగుండేది. జ‌గ‌న్‌పై న‌మ్మ‌కాన్నే చూస్తున్నారు త‌ప్పితే, ప్ర‌జ‌ల్లో బాబుకు పోయిన విశ్వాసం గురించి టీడీపీ నేత‌లు ఎందుకు ఆలోచించ‌రో అర్థం కాదు. ప్ర‌తిదానికి జ‌గ‌న్ పాల‌న‌తో ముడిపెట్ట‌డం వల్ల‌, నిజంగా ముఖ్య‌మంత్రి బాధ్య‌త వ‌హించాల్సిన అంశాలను కూడా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోని ప‌రిస్థితి నెల‌కుంది. 

జ‌గ‌న్‌పై ప‌దేప‌దే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న అనిత‌కు అధినేత‌ల ప్ర‌స‌న్నం ఎప్పుడు ల‌భిస్తుందో మ‌రి. ఎందుకంటే చంద్ర‌బాబు అభ్య‌ర్థుల ఖ‌రారుపై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. పాయ‌క‌రావుపేట విష‌యానికి ఆయ‌న వాయిదా వేయ‌డం దేనికి సంకేతం? ఈ మాత్రం దానికి అనిత అంతేసి గంతులేయాలా? అనేదే ప్ర‌శ్న‌.