ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్… మతపరంగా చూస్తే ప్రపంచంలో చాలా ప్రముఖుడు. కానీ రాజకీ యంగా ఆయన అనామక నేత అనే అభిప్రాయాలున్నాయి. కానీ ఆయన సంధిస్తున్న ప్రశ్నలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాగే పలువురు గాయాల పాలయ్యారు. ఈ ఎపిసోడ్‌ను వైసీపీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. కానీ కేఏ పాల్ మాత్రం సామాజిక కోణంలో చూస్తున్నట్టు… ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయి.
ఇవాళ మరోసారి చంద్రబాబుపై కేఏ పాల్ ప్రశ్నల వర్షం కురిపించారు. కందుకూరు విషాదంపై విచారణ పూర్తయ్యే వరకూ చంద్రబాబు రోడ్‌షోలు, సభలకు అనుమతి నిలిపివేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కందుకూరు దుర్ఘటనను మరిచిపోకనే కావలిలో చంద్రబాబు మళ్లీ అలాంటి సభే నిర్వహించారని తప్పు పట్టారు. పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారని పాల్ నిలదీశారు. బిర్యానీ, మందు, డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి చంపుతారా? అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు మనవడికి నలుగురు గన్మెన్లు ఎందుకని కేఏ పాల్ నిలదీశారు. అలాగే తన కొడుకు, మనవడికి ఇలాగే ప్రమాదం జరిగితే చంద్రబాబు సభలు పెడతారా అని కేఏ పాల్ బుల్లెట్ లాంటి ప్రశ్న సంధించడం గమనార్హం. కందుకూరులో ఒక వైపు ప్రాణాలు కోల్పోయి జనం విషాదంలో మునిగి వుంటే, ఆస్పత్రికి వెళ్లి చూసి వస్తానని, అంత వరకూ ఇక్కడే ఉండాలని చంద్రబాబు చెప్పడంపై కేఏ పాల్ మండిపడ్డారు.
కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇలాగే ప్రమాదానికి గురైతే… కార్యక్రమాలు కొనసాగిస్తారా? అనే ప్రశ్న చాలా విలువైనదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కందుకూరు ఎపిసోడ్‌పై అందరి కంటే ఎక్కువగా కేఏ పాల్ టీడీపీని ఇరకాటంలో నెట్టేలా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు.