2022లో సూపర్ హిట్లు, అట్టర్ ఫ్లాపులు మాత్రమే కాదు. ఊహించని వివాదాలు కూడా టాలీవుడ్ ను చుట్టుముట్టాయి. కొన్ని పరిశ్రమకు చెందిన వివాదాలైతే, మరికొన్ని పర్సనల్ కాంట్రవర్సీలు. విషయం ఏదైనా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన వివాదాలు మాత్రం ఈ ఏడాది చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవేంటో చూద్దాం..
'ఆది'లోనే పురుష్
భారత్ లోనే భారీ బడ్జెట్ సినిమా.. పైగా ఇతిహాసాన్ని ఇతివృత్తంగా చేసుకొని తీస్తున్న సినిమా. కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన చిత్రం. జాగ్రత్తగా తీయాల్సిన ఆదిపురుష్ సినిమా టీజర్ తోనే వివాదాలకు కేంద్రబిందువైంది. ఈ టీజర్ లో రావణుడి పాత్రకు ఇచ్చిన వాహనం, హనుమంతుడితో పాటు వానర సేనకు వేసిన కాస్ట్యూమ్స్ పై తీవ్ర అభ్యంతరాలు చెలరేగాయి. అంతేకాదు, రావణుడ్ని దెయ్యంగా చూపించే ప్రయత్నం చేశారంటూ కొంతమంది వాదించారు. దీంతో ఆదిపురుష్ సినిమా గ్రాఫిక్స్ పనుల్ని తిరిగి ఆది నుంచి మొదలుపెట్టాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది ఈ సినిమా టీజర్.
గరికపాటి 'చిరు' వివాదం
అలయ్ బలయ్ అంటూ కౌగిలించుకోవాల్సిన కార్యక్రమం వివాదాస్పదమైంది. స్టేజ్ పై అభిమానులతో ఫొటోలు దిగుతున్న చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వాటిని చిరంజీవి తేలిగ్గా తీసుకున్నారు. తర్వాత నేరుగా వెళ్లి గరికపాటి పక్కనే కూర్చున్నారు. కానీ ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో జరిగిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. టీ కప్పులో తుపాను టైపులో ఓ 5 రోజుల పాటు జోరుగా సాగింది ఈ కాంట్రవర్సీ. ఆ తర్వాత చిరంజీవి, ఈ వివాదానికి తనదైన శైలిలో ముగింపు పలికారు.
పూరి పరువు తీసిన 'లైగర్'
కెరీర్ లో ఎన్నో ఫ్లాపులు తీశాడు పూరి. కానీ ఏ సినిమా అతడి వ్యక్తిగత ఇమేజ్ ను డ్యామేజ్ చేయలేదు. లైగర్ మాత్రం ఆ పని చేసింది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా డిజాస్టర్ అయింది. దీంతో బయ్యర్లు పూరి ఆఫీస్ పై పడడం స్టార్ట్ చేశారు. బహిరంగంగా స్టేట్ మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. పరిహారం ఇస్తామన్నప్పటికీ నిరసనలు ఆగకపోవడంతో, ఒక దశలో పూరి జగన్నాధ్ కూడా వీటిపై ఘాటుగా స్పందించాడు. దానికి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా లీక్ అయింది. అలా 3 వారాల పాటు లైగర్ వివాదం కొనసాగింది. పూరి ఇమేజ్ ను కొంచెం దెబ్బతీసింది.
టికెట్ రేట్లు పెంచాలా, తగ్గించాలా?
2021లో దుమ్మురేపిన సినిమా టికెట్ల వ్యవహారం 2022 వరకు కొనసాగింది. ముందు టికెట్ రేట్లు పెంచమన్నారు, ఆ తర్వాత వాళ్లే తగ్గించమన్నారు. పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకున్నారు. మధ్యలో సీఎం జగన్ టికెట్ రేట్లు సవరిస్తే భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ ప్రకటనతో ఈ మొత్తం వ్యవహారం మరింత కాక రేపింది. మంత్రి పేర్ని నాని, పవన్ కల్యాణ్.. నువ్వు సన్నాసి అంటే, నువ్వే సన్నాసి అంటూ తిట్టుకునేవరకు వెళ్లింది. ఈ ఏడాది చాలా సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించినప్పటికీ, ఈ వివాదం మాత్రం నివురుగప్పిన నిప్పులా అలానే ఉంది.
షూటింగ్స్ బంద్.. ఎవరికి ఇష్టం?
టాలీవుడ్ లో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారాలు డిమాండ్ చేస్తూ, షూటింగ్స్ ఆపేయాలని పలువురు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొన్ని సినిమాల షూటింగ్స్ ఆపేశారు. అయితే దీనిపై టాలీవుడ్ నిర్మాతలు 2 గ్రూపులుగా విడిపోయారు. కొంతమంది షూటింగ్స్ చేసుకున్నారు, మరికొంతమంది నిర్మాతల్ని సవాల్ చేశారు. ఈ క్రమంలో షూటింగ్స్ బంద్ కు పిలుపునిచ్చి, తన సినిమా వారసుడు షూటింగ్ ను కొనసాగించడంపై దిల్ రాజుపై చాలా విమర్శలు చెలరేగాయి. వీటితో పాటు వీపీఎఫ్ చార్జీలు, ఓటీటీ స్ట్రీమింగ్ నిబంధనలు, ప్రొడక్షన్ కాస్ట్, మేనేజర్ల పాత్రలపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ ఏవీ పూర్తిస్థాయిలో పరిష్కారమవ్వలేదు. ఉన్నంతలో ఓటీటీ రిలీజెస్ పై ఓ క్లారిటీ వచ్చింది.
పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అనసూయ
టాలీవుడ్ లో అత్యంత వివాదాస్పదమైన అంశాల్లో ఒకటి అనసూయ ట్వీట్. లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వగానే అనసూయ 'కర్మ సిద్ధాంతం' అంటూ ఓ ట్వీట్ వేసింది. దానిపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. చివరికి ఆ వివాదం కాస్తా 'ఆంటీ' అనే సంభోదన వైపు మళ్లింది. తనను బాడీ షేమింగ్ చేసిన వాళ్లను హెచ్చరించింది అనసూయ. ఎప్పటికీ తనపై ట్రోలింగ్ ఆగకపోవడంతో, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. కొన్ని సోషల్ మీడియా ఎకౌంట్లపై ఫిర్యాదు చేసింది.
నరేష్-పవిత్ర.. వివాదాల సుడిగుండం
అనసూయ వివాదం ఇలా సద్దుమణిగిందో లేదో నరేష్, పవిత్ర లోకేష్ వివాదం తెరపైకొచ్చింది. వీళ్ల వివాదం రెండు ఎపిసోడ్లుగా తెరపైకొచ్చింది. మొదటి ఎపిసోడ్ లో నరేష్-పవిత్ర సంబంధం.. నరేష్ మూడో భార్య ఆరోపణలు.. పవిత్ర లోకేష్ భర్త ప్రతిస్పందన.. ఇలా సాగింది ఆ వివాదం. ఇక రెండో భాగంలో నరేష్, పవిత్ర లోకేష్ పై సోషల్ మీడియా ట్రోలింగ్స్ షురూ చేసింది. మొదటి వివాదాన్ని తెరవెనక సర్దేసిన ఈ జంట.. రెండో వివాదాన్ని మాత్రం ఆపలేకపోయింది. గత్యంతరం లేక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక మూల ఈ వివాదం నలుగుతూనే ఉంది.
నయనతార పెళ్లి-పిల్లలు.. ఓ వివాదం
లవ్ లైఫ్ తో ఏడేళ్ల పాటు హాట్ టాపిక్ గా నిలిచిన నయనతార, ఈ ఏడాది పెళ్లి చేసుకొని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే ఆ వెంటనే ఆమెపై మరో వివాదం రాజుకుంది. పెళ్లయిన కొన్ని నెలలకే తను తల్లి అయినట్టు ప్రకటించింది నయనతార. సరోగసీ ద్వారా నయన్ దంపతులు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. దీనిపై చాలా వివాదం నడిచింది. ఒక దశలో కేరళ ప్రభుత్వం కూడా ఈ కాంట్రవర్సీపై స్పందించాల్సి వచ్చింది.
అయ్యో 'శేఖర్'
రాజశేఖర్ హీరోగా నటించిన సినిమా 'శేఖర్'. రీమేక్ మూవీగా ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమా రిలీజైన రెండో రోజే లీగల్ చిక్కుల్లో పడింది. తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించకుండానే సినిమా రిలీజ్ చేశారంటూ ఓ ఫైనాన్షియర్ కోర్టుకెక్కడంతో, సినిమా ప్రసారం ఆగిపోయింది. ఆ తర్వాత ఈ వివాదం వారం రోజుల పాటు సాగింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శేఖర్ సినిమా చితికిపోయింది.
విశ్వక్ సేన్ Vs టీవీ9
హీరో దొరికితే చాలు స్టుడియోలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడానికి ఎగబడతాయి న్యూస్ ఛానెళ్లు. కానీ ఓ హీరోను 'గెటవుట్ ఫ్రమ్ మై స్టుడియో' అంటూ యాంకర్ ఆదేశించిన వింత మాత్రం ఈ ఏడాదే చోటుచేసుకుంది. విశ్వక్ సేన్ కు ఈ పరాభవం ఎదురైంది. అయితే విశ్వక్ కూడా తక్కువేం తినలేదు. లైవ్ లో వాడకూడని పదం వాడేశాడు. దీంతో ఇది కాస్తా వివాదాస్పదమైంది. ఆ తర్వాత విశ్వక్ క్షమాపణలు చెప్పినప్పటికీ, మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు కూడా కలుగుజేసుకోవాల్సి వచ్చింది.
తొడలు.. కాళ్లు.. సెక్స్.. ఆర్జీవీ
ఎప్పట్లానే ఈ ఏడాది కూడా ఆర్జీవీ సంచలనాలు, వివాదాలు కొనసాగాయి. యాంకర్ అషు రెడ్డి కాలి బొటనవేలు చీకాడు రామ్ గోపాల్ వర్మ. దీనిపై సోషల్ మీడియాలో, ఛానెల్స్ లో చాలా రాద్దాంతం జరిగింది. ఎప్పట్లానే నేనింతే అంటూ తప్పించుకున్నాడు వర్మ. ఇద్దరు అడల్ట్స్ కలిసి, పరస్పర అంగీకారంతో ఏదైనా చేసే హక్కు తమకు ఉందని.. ఆ వీడియోను చూడాలా వద్దా అనే విజ్ఞత ప్రేక్షకులదని, నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరని ఎద్దేవా చేశాడు. అంతకంటే ముందు ప్రేమ-సెక్స్ పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.
మాటలతో మంటలు రేపిన రష్మిక
ఈ ఏడాది అత్యంత వివాదాస్పదమైన హీరోయిన్లలో రష్మిక కూడా ఉంది. కాంతార విషయంలో ఈమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక దశలో ఆమెపై కన్నడనాట నిషేధం విధిస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఆ వివాదం అలా సద్దుమణిగిందో లేదో, తాజాగా రొమాంటిక్ సాంగ్స్ పై రష్మిక చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి. రొమాంటిక్ సాంగ్స్ కు బాలీవుడ్ కేరాఫ్ అడ్రస్ అని, సౌత్ నుంచి కేవలం డాన్స్ నంబర్లు, ఐటెంసాంగ్స్ మాత్రమే వస్తాయనే అర్థం వచ్చేలా రష్మిక చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.